హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్ మార్పు, కొత్త రూట్ ఇదే..!!
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ పై కీలక అప్డేట్. గత బడ్జెట్ లో కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ కారిడార్లలో ఈ రూటు సైతం అందులో చేర్చారు. కాగా.. ఈ ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన వినతులను పరిశీలన చేసిన కేంద్రం.. ఈ మేరకు కొత్త రూట్ ఖరారు చేసింది. శంషాబాద్ మీదుగా కొత్త అలైన్ మెంట్ ను అధికారులు ఖరారు చేసారు.
హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్ మెంట్ లో మార్పులు జరిగాయి. గతంలో సూర్యాపేట, ఖమ్మం మీదుగా అలైన్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ రూట్ కాకుండా వేరే రూట్‌కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చాలని కేంద్రానికి పంపిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పు జరిగింది. కొత్త అలైన్‌మెంట్ ప్రకారం.. శంషాబాద్ నుంచి భారత్ సిటీ, హాలియా, డ్రైపోర్ట్, వాడపల్లి మీదుగా ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ వెళ్లనుంది. దీంతో ప్రాజెక్ట్ దూరం తగ్గింది. తొలుత ప్రతిపాదించిన మార్గం మేరకు తెలంగాణలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్ దూరం 236 కిలోమీటర్లుగా ఉండగా.. ఇప్పుడు 123 కిలోమీటర్లకు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రూట్లో సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి.

కొత్త రూట్ ఖరారు
పాత రూట్ ప్రకారం శంషాబాద్‌లో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమై.. బాటసింగారం, నార్కట్ పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి వెళుతుంది. ఇందుకు 790 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి వచ్చేది. కానీ ప్రాజెక్ట్ దూరం తగ్గడంతో భూసేకరణకు కూడా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ సమాచారం పంపింది. ఈ రూట్లో మొత్తం నాలుగు స్టేషన్లను నిర్మించనున్నారు. భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లిలో స్టేషన్లను ఉండనున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. డ్రైపోర్ట్ స్టేషన్ మీదుగా వెళ్లడం వల్ల సరుకు రవాణా, ఎగుమతులకు వీలుగా ఉంటుంది. ఆర్ధిక, భౌగోళిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశారు.













Click it and Unblock the Notifications