Hyderabad: ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్, వెయిటింగ్ టైం తెలుసుకోండిలా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం (నవంబర్ 30న) జరగనున్న క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూలైన్ వివరాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ వినూత్న చర్యలు చేపట్టారు. 'పోల్ క్యూ రూట్' అనే ప్రత్యేక పోర్టల్‌ను నగర ఓటర్లకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతోనే ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు రొనాల్డ్ రాస్ తెలిపారు.
జీహెచ్ఎంసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ఈ పోర్టల్ సేవలు పొందవచ్చు. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేసి అందులో పోల్ క్యూ లైన్ పోర్టల్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలను నమోదు చేసి కింద ఉన్న సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. లైన్‌లో వేచి ఉండాల్సిన సమయాన్ని తెలియజేస్తుంది.

ఈ వివరాలను సంబంధిత అధికారి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారని రోనాల్డ్ రోస్ తెలిపారు. అయితే, హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఓటర్ల మాత్రమే ఈ పోర్టల్ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పోల్ క్యూ లైన్ పోర్టల్ డైరెక్ట్ లింక్: https://ghmcbls.in/poll-queue-status
5 గంటల లోపే పోలింగ్ కేంద్రంలో ఉంటేనే ఓటు
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాలు మినహా మిగితా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. కానీ, సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర వరుసలో/క్యూలో నిలుచుకుంటే మాత్రం ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఎన్నికల నియమావళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటే ఓటు వేయవచ్చు. క్యూ ఎంత పొడవు ఉన్నా మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. అయితే, 5 గంటలు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే ఓటు వేసే అవకాశం ఉండదు.












Click it and Unblock the Notifications