అడ్డుకున్నారు: పాక్ యువతికి పోలీసుల సాయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పాకిస్తాన్ మహిళకు సహకరించారు. పాకిస్తాన్‌కు చెందిన ఇరామ్ బానో అనే 20 ఏళ్ల యువతి తన బంధువులను చూసేందుకు హైదరాబాదుకు కొన్ని రోజుల క్రితం వచ్చారు.
తిరిగి హైదరాబాదు నుండి ఆమె దోహాకు బయలుదేరారు. ముంబై మీదుగా ఆమె వెళ్లవలసి ఉంది. ఇందుకోసం ఆ యువతి ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు.

అయితే, ఆన్ లైన్‌లో ఆమెకు చెందిన పూర్తి వివరాలు అప్ డేట్ కాలేదు. దీంతో ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను ఆపివేశారు. ఈ విషయాన్ని ఆమె హైదరాబాదులోని తన వారికి చెప్పింది. తన పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించింది.
వారు హైదరాబాదులోని పాకిస్తాన్ - బంగ్లాదేశ్ డివిజన్ స్పెషల్ బ్రాంచ్‌కి వెళ్లి ఆ యువతి పరిస్థితిని చెప్పారు. ఆమె పరిస్థితిని గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. వెంటనే ఆ యువతి వివరాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించారు. ఫ్యాక్స్ ద్వారా వాటిని ముంబై అధికారులకు పంపించారు. ఆ తర్వాత ఆమెను అధికారులు అనుమతించారు. కాగా, ఆ యువతి ఒంటరిగానే ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications