తెలుగు సినీ నిర్మాతకు కూల్చివేతల షాక్: తనిఖీలు
హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత కెఎల్ నారాయణకు అక్రమ కట్టడాల కూల్చివేతల షాక్ తగిలేట్లే ఉంది. నాలాలపై కబ్జాలను గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పలుచోట్ల వరదనీటి కాలువలను కబ్జాచేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో పలుకుబడిని ఉపయోగించుకొని జీవోల ద్వారా నాలాల ప్రవాహ దిశలను కూడా మార్చేశారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెం5 లోని దేవరకొండబస్తీలో సినీనిర్మాత కేఎల్ నారాయణకు చెందిన సుమాంజలి ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనం కింద వరదనీటి కాలువ ఆక్రమణలకు గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందుకున్న నీటి పారుదలశాఖ డీఈ ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం ఆ భవనంలో తనిఖీలు నిర్వహించారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్న వరదనీటి కాలువ దిశను మార్చడంతో పాటు నాలాపై కప్పువేసుకుని అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. దీనిపై ప్రశ్నించడంతో గతంలో తాము నాలా దిశను మార్చేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక జీవో ద్వారా అనుమతి తీసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడికి దేవరకొండ బస్తీవాసులు చేరుకుని, ఈ నాలాను ఆక్రమించడం వల్ల తమ బస్తీకి ముప్పు పొంచిఉందని తక్షణమే ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. వరదనీటి కాలువపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధనలు ఉన్నాయని, డ్రైనేజీలైన్ లేకుండానే ఇంతపెద్ద భవనం నిర్మిస్తుండడంతో మురుగునీరు మొత్తం వరదనీటి కాలువలోనే కలుపుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు నీటి పారుదలశాఖ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications