హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి: సీఎం రేవంత్ కీలక పిలుపు
హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ తో పాటు అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారిందని అన్నారు. సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు.

"సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ శుభాభినందనలు. సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక AI ని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణం. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ తో పాటు అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారింది. అలాగే మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT దిగ్గజాలు తమ క్యాంపస్ లను విస్తరిస్తున్నాయి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే.. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

డిసెంబర్ 2023 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి కొత్తగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025 లో దావోస్ లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉందని పేర్కొన్నారు.
"రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్ గా ఉంది. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్ లో ట్రాన్స్ జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు. హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.. మన విజయాలను ప్రపంచానికి చూపండని సీఎం రేవంత్ కీలక పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications