హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ మహానగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల అమీర్ పేట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని మరువకముందే టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహబూబ్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మెయిన్ ఇంటీరియర్ ఫోమ్ అండ్ ఫర్నిచర్ గోదాంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే స్పందించి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా గోదాంలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక ఇటీవల హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మెట్రో పిల్లర్ నంబర్ 1043 వద్ద ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అలా క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న ఇతర షాపులకు కూడా వేగంగా వ్యాపించాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ట్రాఫిక్ అంతరాయం భారీగా ఏర్పడింది. అయితే తాజాగా నగరంలో మరో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications