హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖాతాలో మరో రికార్డు: ఏ విషయంలోనంటే?
హైదరాబాద్: ఇప్పటికే అత్యుత్తమ సేవలందిస్తూ అనేక అవార్డులు సొంతం చేసుకున్న హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. మరో రికార్డును సాధించింది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా జీఎంఆర్-శంషాబాద్ విమానాశ్రయం రికార్డు సృష్టించింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
2023 మార్చి నెలలో 90.43 శాతం ఆన్-టైమ్ పనితీరును నమోదు చేసినట్టుగా నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే 90 శాతం మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే కావడం విశేషం. మార్చి నెలలో 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించిన సిరియమ్.. హైదరాబాద్ విమానాశ్రయం 'గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్', 'లార్జ్ ఎయిర్‌పోర్ట్స్' కేటగిరీలలో అగ్రస్థానంలో నిలిచింది.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నవంబర్ 2022లో 88.44 శాతం ఓటీపీ(on time performance)తో 'పెద్ద విమానాశ్రయాల' కేటగిరీలో 4వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. దీన్ని ఆక్చ్యువల్ గేట్ డిపార్చర్ సర్వీస్ ఆధారంగా ఎంపిక చేశారు. అంటే ఇక్కడ్నుంచి బయలుదేరే విమానాలు దాదాపు 80 శాతం వరకు కరెక్ట్ సమయానికి బయలుదేరే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు తేలింది.
కాగా, కొన్ని సంవత్సరాలుగా, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్తమమైన సేవలందిస్తున్నామని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సీఈవో-జీఎంఆర్(GMR) ప్రదీప్ పనికర్ తెలిపారు. విమానాశ్రయ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించామని వివరించారు.
జీఎంఆర్ విమానాశ్రయం ప్రారంభమైనప్పటి నుంచి దేశంలోని విమానాశ్రయ రంగానికి చెందిన అనేక మొదటి-రకం టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇందులో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ ఉన్నాయి. కార్యకలాపాల నిర్వహణలో కూడా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గతంలో పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications