హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే- రేవంత్ రెడ్డి
లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వ నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్ది, న్యూయార్క్ లాంటి నగరాలతో సమానంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు..ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉందని, హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన గుర్తు చేశారు.
నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే హైదరాబాద్ నగరంలో తాగు నీటి సమస్య పరిష్కారమైంది.హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు..అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి.

రూ.35 వేల కోట్లతో 360 కి.మీ తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.40 నుంచి 50వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం.. బీఆరెస్ పదేళ్ల పాలనలో ట్యాంక్ బండ్‌ను మురికి కూపంగా మార్చిందని ,ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలను మోసం చేశారని,పదేళ్లలో నగరానికి కావల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందని కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ నగరం పూర్తిగా కాలుష్యమయమైంది.ముంబైలో వరదలు వస్తే నివసించలేని పరిస్థితి.చెన్నైలోనూ వరదలు వస్తే గందరగోళ పరిస్థితి. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు.దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే.ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి.... హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.అందుకే హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవనం జరగాలి.నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం.నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

శిల్పారామం, ట్యాంక్‌బండ్, హైటెక్‌సిటీ వద్ద సెల్ఫీలు దిగుతూ సెల్ఫ్ డబ్బాలు కొడుతున్నారని కానీ ఇదంతా గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి మూసీలో పడుకున్నా.. అందులో ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడి ప్రజలు ఆయన్ను పట్టించుకోరని సీఎం విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గర నుంచి రూ. 25 వేల కోట్ల నిధులు మూసీ అభివృద్ధికి తీసుకురావాలని సూచించారు.












Click it and Unblock the Notifications