హైదరాబాద్ శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం... ట్యాంకర్,లారీ దగ్ధం... ఒకరు సజీవ దహనం...
హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం(మార్చి 11) ఉదయం రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్,లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడంతో ఒకరు సజీవదహనమయ్యారు. మంటల ధాటికి ఆయిల్ ట్యాంకర్,లారీ దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
హైదరాబాద్ నుంచి తమిళనాడులోని సేలం వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను లారీ ఓవర్ టేక్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రెండు లారీల మధ్య బలంగా రాపిడి జరడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్‌లోని వ్యక్తి సజీవదహనమయ్యాడు. మంటల్లో కాలిపోతూ అతను చేసిన హాహాకారాలు స్థానికులను కంటతడి పెట్టించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ కిందకు దిగి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్‌పై స్తంభించిపోయింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం స్థానికుల సహాయంతో పోలీసులు రోడ్డు పైనుంచి వాహనాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ అతివేగంగా దూసుకొచ్చి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు యువకులు నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన వేడుకకు హాజరై... అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై అతివేగంతో రయ్యిమని దూసుకెళ్లారు. చాదర్‌ఘాట్‌కు చేరుకున్న సమయంలో వేగం అదుపు కాకపోవడంతో బస్సును ఢీకొట్టారు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతులను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత నెల ఫిబ్రవరిలో హస్తినపురం పరిధిలోనూ ఇదే తరహాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌతమ్ అనే యువకుడు మద్యం సేవించి అతివేగంతో కారు డ్రైవ్ చేశాడు. అదుపు తప్పిన కారు డివైడర్‌పై నుంచి మరో పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చొన్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే సందీప్ చనిపోయిన విషయం గ్రహించి గౌతమ్ అక్కడినుంచి పరారయ్యాడు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.












Click it and Unblock the Notifications