హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. నేపాలీ ముఠా అరెస్ట్..
సరిగ్గా ఆరు నెలల క్రితం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, దోపిడీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దాదాపు రెండు నెలల పాటు నేపాల్, ఇతర రాష్ట్రాల్లో అలుపెరగకుండా శ్రమించి, ఈ దారుణానికి ఒడిగట్టిన పనిమనిషితో సహా నలుగురు సభ్యుల అంతర్జాతీయ నేపాల్ ముఠాను సిట్, జూబ్లీహిల్స్ బృందాలు అరెస్ట్ చేశాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం మీడియా సమావేశంలో ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులైన ధర్మ అలియాస్ కల్పన (26), గణేశ్ బీకే (31), చంద్ర బహదూర్ థమన్ (44), గణేశ్ బహదూర్ షాహి (37)లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 51,130 నగదుతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రే వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది మే 7- 8 తేదీల మధ్య రాత్రి సమయంలో జూబ్లీహిల్స్ స్టేషన్ పరిధిలోని ప్రశాసన్ నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య శ్రీమతి తనుజా రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా అధికారి నివాసంలోకి చొరబడిన దుండగులు.. ఆమెను కదలకుండా బంధించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న దాదాపు 225 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యారు.

మరోవైపు అదే సమయంలో ఇంట్లో పనిచేస్తున్న నేపాల్ కు చెందిన పనిమనిషి ధర్మ అలియాస్ కల్పన కనిపించకుండా పోయింది. అంతేకాక ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో కల్పన తన నేపాలీ గ్యాంగ్ తో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఈ క్రమంలో ఈ ముఠాను పట్టుకునేందుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. బెంగళూరు, ముంబై, పూణె, సూరత్, పాట్నా, దిల్లీ, లక్నో, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో దాదాపు ఐదు నెలలకు పైగా దర్యాప్తు చేపట్టింది. అలాగే నేపాల్ బోర్డర్ లోని మారుమూల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నిందితుల కదలికలను గుర్తించింది. ఈ క్రమంలో ప్రధాన నిందితులైన కల్పన, గణేశ్ బీకే, చంద్ర బహదూర్ తమాంగ్, గణేశ్ బహదూర్ షాహిలను అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఇళ్లలో పనిమనుషులు లేదా వాచ్ మెన్లను పెట్టుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సజ్జనార్ సూచనలు చేశారు. తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో ఉచిత పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
