పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సరికొత్త చరిత్ర.. ఇక అంతా ఏఐ మయం!
టెక్నాలజీ వినియోగంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలనానికి తెరతీసింది. దేశంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పోలీస్ స్టేషన్‌గా హైదరాబాద్‌లోని పంజాగుట్ట స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు, పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్టేషన్‌లోని సేవలన్నింటినీ అత్యాధునిక ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు సీపీ సజ్జనార్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఆయన నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్‌లోని ప్రతి ఒక్క సిబ్బంది పనితీరు, వారు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ జహంగీర్‌లతో కలిసి స్టేషన్‌లో ఏర్పాటు చేస్తున్న ఏఐ టెక్నాలజీ సదుపాయాలను దగ్గరుండి పరిశీలించారు.
డిసెంబర్ తొలి వారంలో ప్రారంభం
ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సిద్ధమవుతున్న ఏఐ పోలీస్ స్టేషన్‌ను డిసెంబర్ మొదటి వారంలో డీజీపీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన తర్వాత, ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

10 భాషల్లో ఫిర్యాదు చేసేలా 'సేతు' కియోస్క్
సామాన్య ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు స్టేషన్ రిసెప్షన్‌లో ఇప్పటికే 'సేతు' పేరుతో ప్రత్యేక కియోస్క్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా బాధితులు తమకు తెలిసిన సుమారు 10 భాషల్లో ఎందులోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఏఐ సాంకేతికత ఆ ఫిర్యాదును క్షణాల్లోనే స్థానిక భాషలోకి అనువదించి, సంబంధిత అధికారులకు పంపిస్తుందని సీపీ వివరించారు. దీనివల్ల భాషా సమస్య లేకుండా ఎవరైనా నేరుగా తమ గోడును చెప్పుకునే వీలు కలుగుతుంది.
ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్‌షీట్ వరకు అంతా ఏఐ మయం
కేవలం ఫిర్యాదుల స్వీకరణ మాత్రమే కాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేస్ డైరీ, దర్యాప్తు నివేదికలు, చివరకు ఛార్జ్‌షీట్ తయారీ వరకు ప్రతి పని ఏఐ సాయంతోనే వేగంగా జరగనుంది. అంతేకాకుండా, పంజాగుట్ట ప్రాంతంలోని రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు, పాత నేర చరిత్ర వంటి వివరాలను ఏఐ విశ్లేషిస్తుంది. ఆ సమాచారం ఆధారంగా బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నడిపిస్తూ నేరాలను అదుపు చేస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించేలా స్టేషన్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.














Click it and Unblock the Notifications
