ఆ మాటే వినపడకూడదు: డెడ్‌లైన్ పెట్టిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్
Hyderabad Police Commissioner: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. కీలక ఆదేశాలను జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ టవర్‌లో గల కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నప్పుడే తన ఉద్దేశం ఏమిటో తెలియజేశారాయన. తన ప్రాధాన్యతల గురించి వివరించారు.
దీనికి అనుగుణంగా ఇప్పుడు తాజా ఆదేశాలు విడుదలయ్యాయి. డ్రగ్స్ రహిత నగరాన్ని తీర్చిదిద్దుతామంటూ ఇచ్చిన హామీని కార్యాచరణలోకి తీసుకొచ్చారు. రేవ్, వీకెండ్ పార్టీల పేరుతో డ్రగ్స్‌ను వినియోగం, డ్రగ్ పెడ్లర్స్ నెట్‌వర్క్‌పై డేగకన్ను వేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

పబ్‌లపై ప్రత్యేకంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని, దీనికి అనుగుణంగా తక్షణ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. పబ్స్ అన్నీ కూడా.. నిర్దేశిత సమయానికి మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయం మించిపోయిప్పటికీ.. పబ్‌ను తెరచి ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పబ్బుల్లో డ్రగ్స్ కట్టడికి నిరంతరంగా నిఘా పెట్టాలని, దీనికోసం టాస్క్‌ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. పబ్స్‌లల్లో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. రెండే రెండు నెలల్లో హైదరాబాద్‌లో పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయాలని, సిటీలో డ్రగ్స్, గంజాయి అనే మాటే వినపడకూడదని కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
1994 బ్యాచ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. వివిధ పోస్టుల్లో పని చేశారాయన. నిన్నటివరకు ఆర్గనైజేషన్ అండ్ లీగల్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్‌గా పని చేశారు. ఇటీవలే ఆయనను నగర పోలీస్ కమిషనర్‌గా బదిలీ చేసింది రేవంత్ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications