ఆ వార్తలపై స్పందించిన బిగ్ బాస్ తెలుగు ఫేమ్ హిమజ: ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. వీకెండ్‌లల్లో ఇలాంటి అవాంఛనీయ కార్యకలాపాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. పోలీసుల డేగ కన్ను వేసినప్పటికీ, బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినప్పటికీ దాని నుంచి తప్పించుకుని మరీ రేవ్ పార్టీలను నిర్వహిస్తోన్నారు.
తాజాగా మరోసారి అలాంటి ఉదంతమే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నగర శివార్లల్లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖలు పోలీసుల చేతికి దొరికినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసుల చేతికి దొరికిన వారిలో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారని అంటున్నారు. తనకు ఉన్న పరిచయాలతో హిమజ ఈ రేవ్ పార్టీని నిర్వహించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాను పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తోన్న వార్తలపై హిమజ స్పందించారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
తన కొత్త ఇంట్లో బంధుమిత్రులతో కలిసి దీపావళి సందర్భంగా హౌస్ పార్టీని జరుపుకొన్నామని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ఫిర్యాదు చేశారని వివరించారు. దీన్ని ఫేక్ న్యూస్‌గా కొట్టి పారేశారు. ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
ఓ సెల్ఫీ వీడియోను కొద్దిసేపటి కిందటే ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫిర్యాదును అందుకున్న పోలీసులు తమ ఇంటికి వచ్చి చెక్ చేసుకుని వెళ్లారని, వారికి తాము పూర్తిగా సహకరించామని అన్నారు. దీపావళి హౌస్ పార్టీని కొన్ని న్యూస్ ఛానళ్లు రేవ్ పార్టీగా పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంట్లో దీపావళి వేడుకల సందర్భంగా అమ్మవారికి పూజలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటోన్నామని, అలాంటప్పుడు రేవ్ పార్టీ ఎలా జరుగుతుందని అన్నారు. తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు వార్తలు రావడం సరికాదని, ఇంట్లోనే ఉన్నానని, తాను గానీ, కుటుంబ సభ్యులు గానీ ఎవరూ అరెస్ట్ కాలేదని హిమజ వివరించారు.












Click it and Unblock the Notifications