హైదరాబాద్ పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్..ఆ రోజు గీత దాటితే కొరడా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో భద్రతకు సంబంధించి నగర పోలీసులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుండి జనవరి 1 తెల్లవారుజామున జరుపుకునే వేడుకల కోసం త్రీ స్టార్, అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న హోటళ్లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు/పబ్‌ల నిర్వాహకులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈవెంట్లను అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు నిర్వహించాలనుకునే యాజమాన్యాలు తప్పనిసరిగా ముందుగానే అనుమతి తీసుకోవాలి.
కనీసం 15 రోజుల ముందుగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ అమలు చట్టం 2013 ప్రకారం, నిర్వాహకులు ఎంట్రీ/ఎగ్జిట్, పార్కింగ్ స్థలాల్లో రికార్డింగ్ సదుపాయంతో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నిర్వహణకు సెక్యూరిటీ గార్డ్‌లను నియమించాలి. ఈవెంట్లల్లో అశ్లీలత ఉండకూడదు. ఈ విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు సహించబోమని హైదరాబాద్ నగర పోలీసులు తేల్చి చెప్పారు.

బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లౌడ్‌స్పీకర్, డీజే సిస్టమ్, డీజే సౌండ్ మిక్సర్, సౌండ్ యాంప్లిఫైయర్, ఇతర అధిక శబ్ద పరికరాలను రాత్రి 10 గంటల తర్వాత నిలిపివేయాలి. ఇండోర్ ప్రాంగణలైన కమ్యూనిటీ హాళ్లు, బ్యాంక్వెట్ హాళ్లు, ఫంక్షన్ హాళ్ల వంటి చోట్ల రాత్రి 10 గంటల తర్వాత కూడా సౌండ్ సిస్టమ్‌కు అనుమతి ఉంది. తెల్లవారుజామున ఒంటిగంట వరకు మాత్రమే వర్తిస్తుంది. సౌండ్ 45 డెసిబెల్స్ మించకూడదు.
ప్రాంగణ సామర్థ్యానికి మించి పాసులు, టిక్కెట్లు, కూపన్లను జారీ చేయకూడదు. ఇది శాంతిభద్రతల సమస్యలకు దారితీయవచ్చని పోలీసులు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో మైనర్లను అనుమతించకూడదు. డ్రగ్స్, నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలను ఉపయోగించడానికి ఎవరినీ అనుమతించవద్దని నిర్వాహకులను కఠినంగా హెచ్చరించారు. ఈ విషయంలో యాజమాన్యం విఫలమైతే, అది వారి బాధ్యతేనని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. మద్యం సేవించిన కస్టమర్లను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి డ్రైవర్లు/క్యాబ్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పబ్‌లు/బార్‌ల యాజమాన్యాలదే. వేడుకల్లో బాణసంచా వినియోగం పూర్తిగా నిషేధం. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మైనర్లు వాహనాలు నడపకూడదు, ఏదైనా ఉల్లంఘన లేదా మైనర్ వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగితే యజమానులే బాధ్యులవుతారు.












Click it and Unblock the Notifications