Hyderabad: చలానా కోసం ఆపితే.. ప్రాణం పోయింది! కాలర్ పట్టి లాగారా?
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చలానా కోసం పోలీసులు ఓ బైక్‌ను ఆపడంతో ఆ తర్వాత జరిగిన ప్రమాదంలో ఆ వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల నిర్లక్ష్యంగా కారణంగానే వ్యక్తి ప్రాణాలు పోయాయాంటూ వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చాలానా వేసేందుకు రన్నింగ్‌లో ఉన్న బైక్‌ను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే, అతడు తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో అటువగా వస్తున్న బస్సు.. బైక్ నడుపుతున్న వ్యక్తి తలపైనుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు, వాహనదారులకు మధ్య కాసుపు తోపులాట జరిగింది.
పోలీసుల కారణంగా వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడని.. ఇప్పుడు అతని కుటుంబం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అవసరమైతే సిగ్నల్ వద్ద ఆపవచ్చు కాదా అని నిలదీశారు. బైక్ ఆపకుండా ఫొటో తీసి చలాన్ వేయొచ్చు కదా అని అని ప్రశ్నించారు. వ్యక్తి ప్రాణం తీసుకొస్తారా? అని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన చేస్తున్న వాహనదారులను పోలీసులు చెదరగొట్టారు.
పోలీసులు కాలర్ పట్టి లాగడంతోనే..
బస్సు మీద నుంచి వెళ్లడంతో మృతి చెందిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు అలియాస్ బాబ్జీగా గుర్తించారు. హైదరాబాద్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి కుటుంబసభ్యులు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి తమ సోదరుడు జోష్ బాబు మృతి చెందాడని మృతుని సోదారుడు, కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బైక్ ముందుకు వెళుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని లాగాడని.. ఆ సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. చొక్కా లాగడంతోనే అదుపు తప్పి జోష్ బాబు అలియాస్ బాబ్జీ బస్సు చక్రాల కింద పడి చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications