వినియోగదారులపై కరెంట్ బిల్లుల పిడుగు: ఇక నెలనెలా అదనపు మోత!
నిత్యావసర ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో ఆర్థిక భారం పడింది. హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ట్రూ-అప్ ఛార్జీల రూపంలో షాకిచ్చాయి. ఈ నెల నుంచి వినియోగదారుల నెలవారీ కరెంట్ బిల్లుల్లో ఈ అదనపు ఛార్జీలను కలిపి వసూలు చేయడం ప్రారంభించాయి.
అసలు ఈ ట్రూ-అప్ ఛార్జీలు ఎందుకు?
డిస్కంలు ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తాము కొనుగోలు చేయబోయే విద్యుత్ ఖర్చులను ముందుగానే అంచనా వేసి ఆ మేరకు టారిఫ్‌లను నిర్ణయిస్తాయి. అయితే డిమాండ్ పెరగడం లేదా బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు అధికంగా ఉండటం వంటి కారణాల వల్ల అంచనా వేసిన దానికంటే వాస్తవ కొనుగోలు వ్యయం ఎక్కువగా ఉంటుంది. 2022-23 , 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా డిస్కంలకు ఏర్పడిన ఆర్థిక లోటును భర్తే చేసుకునేందుకు ఆయా సంవత్సరాల్లో వినియోగదారులు వాడిన కరెంట్ ఆధారంగా ఇప్పుడు ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. దీనివల్ల సాధారణ గృహ వినియోగదారుల నెలవారీ బిల్లుల్లో రూ.25 నుంచి రూ.50 వరకు అదనంగా భారం పడుతోంది. ఈ వసూళ్ల ప్రక్రియ రెండేళ్లకు పైగా కొనసాగనుంది.

బిల్లుల వసూలు విధానం ఇలా..
రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో వినియోగదారులపై ఈ భారం వేర్వేరు కాలపరిమితుల్లో ఉండనుంది. తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, ఇతర జిల్లాల వినియోగదారులు మొత్తం 29 నెలల పాటు ఈ అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2027 వరకు 2022-23 ఆర్థిక సంవత్సర సగటు విద్యుత్ వినియోగం ఆధారంగా యూనిట్ కు 30 పైసల చొప్పున వసూలు చేస్తారు. ఆ తర్వాత వచ్చే నెలల్లో 2023-24 వినియోగానికి సంబంధించి ఈ ఛార్జీ యూనిట్‌కు 50 పైసలకు పెరగనుంది. మరోవైపు తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని జిల్లాల వినియోగదారులపై 26 నెలల పాటు ఈ ట్రూ-అప్ ఛార్జీల భారం కొనసాగుతుంది.
రూ.7,635.22 కోట్ల వసూలుకు ఆమోదం
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ట్రూ-అప్ ఛార్జీల కింద మొత్తం రూ.7,635.22 కోట్లను రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇటీవల డిస్కంలకు అనుమతినిచ్చింది. ఈ మొత్తం బకాయిల్లో వ్యవసాయ రంగానికి అందించిన ఉచిత విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.2.214.99 కోట్ల భారం ఉంది. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రాయితీ రూపంలో భరించేందుకు అంగీకరించింది. అయితే మిగిలిన రూ.5420.23 కోట్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక తదితర విద్యుత్ వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లుల రూపంలో డిస్కంలు వసూలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications
