ఆమ్రపాలి మెరుపు పర్యటన
Hyderabad rains: భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.
భారీ వర్షాల ధాటికి అమీర్‌పేట్, బేగంపేట్, షేక్‌పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపు పర్యటన చేపట్టారు. పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. అక్కడి వర్ష తీవ్రత, నష్టాల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడం, రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు- అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు. రోడ్లపై నిలిచిన వర్షపునీటిలో పిల్లలు, వృద్దులు ఒంటరిగా బయటికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించవద్దని సూచించారు.

మ్యాన్ హోల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని ఆమ్రపాలి పునరుద్ఘాటాంచారు. అవి తెరిచి ఉంటే ఆలస్యం చెయ్యకుండా గ్రేటర్ హైదరాబాద్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 040 21111111 లేదా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 9000113667కు సమాచారం ఇవ్వాలని కోరారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జోనల్ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారని అన్నారు.












Click it and Unblock the Notifications