గదిలో బంధించి వ్యభిచారం చేయమన్నారు: మహిళ కంటతడి
హైదరాబాద్: ఉపాధి కోసమని సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ మహిళ తన దీన గాధను మీడియాతో పంచుకుంది. భర్త చనిపోవడంతో పరిచయస్థులను ఆశ్రయిస్తే వారు తనను సౌదీ అరేబియాకు అమ్మేశారని కన్నీరు మున్నీరైంది. సౌదీ అరేబియాలో కుట్టు, ఎంబ్రాయిడరీ, మెహందీ వంటి పనుల కోసం సౌదీ అరేబియా వెళ్లిన 18మంది మహిళలను అక్కడ షేక్‌ల శారీరక, మానసిక హింసలకు గురి చేశారు.
షేక్‌ల బారి నుంచి తప్పించుకుని భారత రాయబార కార్యాలయం సహకారంతో పలువురు మహిళలు స్వదేశానికి చేరుకున్నారు. ఉపాధి కల్పిస్తామని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ఆశ చూపి, తనను 25వేల రియాల్స్‌కు సౌదీకి అమ్మేశారని బాధిత మహిళల్లో ఒకరైన ఉస్నా బేగం చెప్పింది.
సంఘటన వివరాలను ఆమె వివరించింది. హైదరాబాదు నగరంలోని హాసన్‌నగర్‌కు చెందిన ఉస్నాబేగం భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. కొడుకు, కుటుంబాన్ని పోషించుకోవటం ఆమెకు కనాకష్టంగా మారింది. ఏదైనా ఉద్యోగం కోసం తనకు పరిచయమున్న మహిళను సంప్రదించింది.

సౌదీలో ఎంబ్రాయిడింగ్, జిగ్‌జాగ్, టైలరింగ్, మెహింది, పికోపాల్ వంటి పనులు చేసుకోవచ్చని చెప్పి, ఉస్నాను తనకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా నెల క్రితం సౌదీకి పంపింది. సౌదీకి చేరుకోగానే కేవలం గంటల వ్యవధిలోనే ఆమె ఆశలు అడుగంటి పోయాయి.
అక్కడి షేక్‌లు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారని, ఇంటి పనితోపాటు వ్యభిచారం చేయాలంటూ నిర్బంధించారని ఆమె చెప్పింది. వారు చెప్పిన పనులు చేయని తనను గదిలో వేసి బంధించగా, ఒకసారి తప్పించుకునేందుకు ప్రయత్నించి దొరికితే అనేక రకాల చిత్రహింసలకు గురి చేశారని చెప్పింది.
తర్వాత కూడా తనను గదిలో బంధించగా, అతి కష్టంగా తప్పించుకుని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించానని, అక్కడి అధికారుల సహాయంతో స్వదేశానికి చేరుకున్నట్లు ఉస్నా వివరించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఉస్నాను ట్రావెల్స్ ఏజెన్సీకి పరిచయం చేసిన మహిళ, ఏజెన్సీ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సౌదీలో ఉస్నా వేధింపులకు గురవుతున్నట్లు తెలుసుకున్న ఉస్నా తల్లి అబేదా బేగం ఆమెను సౌదీకి పంపిన ట్రావెల్స్ ఏజెన్సీపై ముంబై అర్బన్‌లోని కుర్లా పోలీస్‌స్టేషన్‌లో గత నెల 25న ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు భారత రాయబారి కార్యాలయంతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతూ బాధిత మహిళలు సురక్షితంగా బయటపడేందుకు తోడ్పడ్డారు.












Click it and Unblock the Notifications