హైడ్రా వాటిని కూల్చదు.. వీటిని వదిలిపెట్టదు: రంగనాథ్ తేల్చేశారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించినప్పటికీ.. నివాస గృహాలను ముట్టుకోబోమని పేర్కొన్నారు.
2024 జులై ముందు నిర్మించిన గృహాలను కూల్చదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌లో అనుమతి లేకుండా కట్టిన వాటిని మాత్రం వదిలేది లేదని, హైడ్రా కూల్చుతుందని తేల్చి చెప్పారు. అనుమతులు లేని వ్యాపార, వాణిజ్య కట్టడాలను మాత్రం కూల్చుతామన్నారు కమిషనర్ రంగనాథ్.

గతంలో అనుమతులు ఇచ్చి, తర్వాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలేనని అన్నారు. అనుమతులు రద్దైనా నిర్మాణాలు జరుగుతుంటే అవి అక్రమమే. కొందరు పేదలను ముందు పెట్టి, వెనక చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. కబ్జాదారుల చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
మల్లంపేట కొత్వాల్ చెరువు, అమీన్‌పూర్‌లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలేనని అన్నారు. ఎఫ్‌టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు చేపడతామని కమిషనర్ చెప్పారు.
ఐదు నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోందని రంగనాథ్ తెలిపారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకుని మరింత నిబంద్ధతతో హైడ్రా పనిచేస్తోందని తెలిపారు. వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి ముందుకు వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వం దిశా నిర్దేశం మేరకు హైడ్రా పనిచేస్తుందన్నారు. భూ కబ్జాల వెనకున్న పాత్రధారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైడ్రాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టిందన్నారు. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుందన్నారు. గత ఐదు నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుందని కమిషనర్ రంగనాథ్ వివరించారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేలా హైడ్రా పని తీరు ఉంటుందని, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications