స్మిత సబర్వాల్ బదిలీ..!!
Smita Sabharwal: తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మందికి వేర్వేరు శాఖలు, విభాగాల్లో పోస్టింగులను ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్మిత సబర్వాల్ సహా సీనియర్ ఐఎఎస్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.
రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా ఉన్న స్మిత సబర్వాల్.. యువజన వ్యవహారాలు, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. ఆ శాఖ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అక్కడ పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్న ఎన్ శ్రీధర్ రిలీవ్ అయ్యారు.

ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులు అయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ రెండుచోట్ల ఉన్న బీ వెంకటేశం, జెండగె హనుమంత్ కొండిబా రిలీవ్ అయ్యారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న డాక్టర్ టీకే శ్రీదేవి రిలీవ్ అయ్యారు. గనుల శాఖ కార్యదర్శి కే సురేంద్ర మోహన్.. రవాణా శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న కే ఇళంబర్తి రిలీవ్ అయ్యారు.
వెయిటింగ్‌లో ఉన్న చెవ్వూరి హరికిరణ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డీ కృష్ణ భాస్కర్ ట్రాన్స్‌కో సీఎండీగా బదిలీ అయ్యారు. అలాగే- ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగాల్సి ఉంటుందాయనకు.
వెయిటింగ్‌లో ఉన్న జీ సృజన, చిట్టెం లక్ష్మిలకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా సృజన, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మిలను అపాయింట్ చేసింది. కార్మిక శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య.. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడున్న ఎఫ్ఏసీ ఏ దేవసేన రిలీవ్ అయ్యారు.
కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్‌కు అదే శాఖ కమిషనర్‌గా అదనపు పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్.. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications