టైమ్ ఇస్తే సామాన్లు తీసుకెళ్తా: రేవంత్ తమ్ముడు రిక్వెస్ట్
HYDRA: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్‌గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోందీ వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులను జారీ చేసింది హైడ్రా. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో నిర్మించివుంటే ఇంటిని కూల్చివేయాల్సి ఉంటుందనీ పేర్కొన్నారు.
ఈ నోటీసులపై తిరుపతి రెడ్డి మాట్లాడారు. తన ఇల్లు అక్రమంగా నిర్మంచివుంటే వెంటనే కూల్చివేయాలని తిరుపతి రెడ్డి అన్నారు. కూల్చివేసే ముందు తనకు కొంత టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్లను తీసుకుని బయటకి వెళ్లిపోతానని చెప్పారు. నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, ఇప్పటివరకు ఏ అధికారి కూడా తనను కలవలేదని పేర్కొన్నారు.
2016-17 సంవత్సరంలో అమర్ సొసైటీలో గల ఈ కట్టిన ఇంటిని కొనుగోలు చేశానని, స్థలం కొని తాను కట్టుకున్న ఇల్లు కాదని తిరుపతి రెడ్డి వివరించారు. ఈ ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఇది ఎఫ్‌టీఎల్‌లో ఉందా? లేదా? అనేది తనకు తెలియదని, అలాంటి సమాచారం ఏదీ తన వద్ద లేదని అన్నారు.
ఇప్పుడీ ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వాల్టా యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారని తిరుపతిరెడ్డి తెలిపారు. 1995లోనే ఈ లేఔట్ వేశారని, అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తన ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తోన్నారని విమర్శించారు. 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications