వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!!
ఎండలు మండిపోతున్న వేళ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మండు వేసవిలో వర్షాల పైన సమాచారం అందించింది. వాతావరణంలో రానున్న వారం రోజుల్లో మార్పులు వస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. దీంతో.. వాతావరణ శాఖ అప్డేట్స్ పైన యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.
తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలులు, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 16 నుంచి 23 వరకు వారం పాటు రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.

ఈ జిల్లాలకు తాజా అలర్ట్స్
ప్రధానంగా రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయని, ఏప్రిల్ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొన్నది. తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వెల్లడించింది.












Click it and Unblock the Notifications