తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
రాష్ట్రవ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ వర్షాలు గురు, శుక్రవారాల్లో కూడా కొనసాగుతాయని తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై రేపటిలోగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా వేసింది. ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.
వీటివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. మెండోరా(నిజామాబాద్ జిల్లా)లో 1.9, భైంసా(నిర్మల్)లో 1.2, గోధూరు(జగిత్యాల)లో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కొత్త గూడెం, జగిత్యాల, మహబూబాబాద్, జనగాం, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నాయి.

బుధవారంరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు రేపు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. శుక్రవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైతులు కూడా వ్యవసాయ పనులను ముమ్మరంగా ప్రారంభించారు. రాగల 48 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications