భయపెడుతున్న తుఫాన్, అత్యంత భారీ వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!!
ఆర్నాబ్ తుఫాను ముంచుకొస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పైనా ప్రభావం చూపనుంది. ఏపీ లో తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో పలు జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదే విధంగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అత్యవసర అవసరాలు ఉంటేనే ప్రయాణాలు చేయాలని.. లేదంటే వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి 'ఆర్నబ్' తుపానుగా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయ దిశలో సుమారు 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతా నికి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో ఈ మూడు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. తుపాను మరింత బలపడుతున్నందున ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం అప్రమత్తం.. కీలక నిర్ణయాలు
తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్ 29న కూడా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. అక్టోబర్ 28, 29 తేదీల్లో చాలా చోట్ల మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిస్తాయని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
