తెలంగాణలో టీడీపీ కొత్త పొత్తు- టార్గెట్ కేసీఆర్: అక్కడే అసలు ట్విస్ట్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ సీఎం జగన్. ఇందు కోసం విభిన్న మార్గాలు..కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు ఏపీలో అధికారం చంద్రబాబు ఆసలు లక్ష్యం. తాజాగా..విజయవాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ కు వెళ్లటం.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత పైన ప్రతిపాదన చేసారు. పొత్తు దిశగా కీలక అడుగులు వేసారు. ఇదే సమయంలో దూరంగా ఉన్న బీజేపీ ని దగ్గర చేసుకొనేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2014 పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి జగన్ కు ఎటువంటి మద్దతు లేకుండా చేయాలనేది చంద్రబాబు ఉద్దేశం.

తెలంగాణలోనూ పొత్తులతో
ఇందు కోసం ఇప్పటికే రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అడగకుండానే మద్దతిచ్చి వారితో గ్యాప్ కొంత మేర భర్తీ చేసుకొనే ప్రయత్నం చేసారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్ష్యం తెలంగాణ లో అధికారం. ఇందుకు సహకరించేందుకు చంద్రబాబు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ సమావేశంలో తెలంగాణలో 7-14 సీట్లలో పోటీ, 2-4 ఎంపీ సీట్లలో పోటీ చేద్దామంటూ ప్రతిపాదన చేసారు. అటు చంద్రబాబు ఈ మధ్య కాలంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ రాజకీయ శత్రువుగా మారిన బీజేపీకి సాయం అందించటం ద్వారా ఒకే దెబ్బకు ఇటు కేసీఆర్..అటు ఏపీలో జగన్ కు షాక్ ఇవ్వాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

ఇద్దరు సీఎంలు లక్ష్యంగా వ్యూహాలు
ఏపీ కంటే తెలంగాణలోనే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ సమయాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ముందుగా తెలంగాణలోనే టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుకు బీజం పడాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీని ద్వారా కేసీఆర్ ను దెబ్బ తీయటంలో బీజేపీకి సహకరించి..ఏపీలో పొత్తు ఖాయం చేసుకోవాలని ఆలోచనగా టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ -జనసేన తో కలవటం ద్వారా హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి కలిసి వస్తుందనే విశ్లేషణలను టీడీపీ నేతలు తెర మీదకు తీసుకొస్తున్నారు. అయితే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబుతో పొత్తు విషయంలో డైలమాలో ఉన్నారు.

చంద్రబాబు తో బీజేపీ కలుస్తుందా
చంద్రబాబుతో కలవటం ద్వారా కేసీఆర్ కు ఆయుధం అందిచనట్లు అవుతుందనే వాదన మొదలు పెట్టారు. గతంలో సీఎం కేసీఆర్ ఇదే రకమైన ప్రచారంతో టీడీపీని తెలంగాణకు దాదాపుగా దూరం చేసారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ..ఇప్పుడు బీజేపీతో జత కడితే రాజకీయంగా నష్టపోతామనేది ఆ పార్టీ నేతల వాదన. కానీ, కేసీఆర్ తన పార్టీ పేరులోనే తెలంగాణ మార్చి..భారత్ రాష్ట్ర సమితిగా మార్చటం ద్వారా ఆ వాదనకు మద్దతు ఉండదనేది మరో విశ్లేషణ. దీంతో..ఇప్పుడు చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే రాజకీయ వ్యూహాలు..ప్రత్యర్దుల ఎత్తుగడలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications