Bathukamma: తెలంగాణలో మొదలైన పూల పండుగ..
తెలంగాణలో పూల పండుగ మొదలైంది. శనివారం ఎంగిలిపూల బతకమ్మతో సంబరం ప్రారంభమైంది. తెలంగాణలోని పల్లెలన్నీ శనివారం ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నాయి. ఊళ్లలో అయితే ఉదయాన్నే పూవ్వు కోసుకొచ్చారు. ఇక పట్టణాల్లో మార్కెట్లకు వెళ్లి పువ్వూ కొనుగోలు చేశారు. షిబ్బిలో బతుకమ్మను అందంగా పేర్చారు. సాయంత్రం కాగానే బతుకమ్మను చేతిలో పట్టుకుని చౌరస్తాకు చేరుకున్నారు మహిళలు.
మహిళలు అందరు కలిసి బతుకమ్మ ఆడారు. కుల భేదం లేకుండా అందురు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. కరీంనగర్ తో పాటు హనుమకొండ జిల్లా వెయ్యిస్తంభాల గుడి వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు ఆదివారం అంటే ఈ రోజు అటుకుల బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోనున్నారు.

9 రోజులు 9 రకాలుగా బతుకమ్మలను పేర్చి నవ నైవేద్యాలను సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్ద పప్పు, నాలుగో రోజు బియ్యం, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ జరుపుకొన్నారు.
ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ వాసులు శనివారం ఘనంగా చేసుకున్నారు.పలు కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో యువతులు, మహిళలు బతుకమ్మను పేర్చి ఆడారు. ఓల్డ్ హఫీజ్ పేట, అల్వాల్, కొత్తపేట, కాచిగూడ, మన్సూరాబాద్, కూకట్పల్లి, సుందరయ్య పార్కు, బౌద్ధనగర్, పద్మారావునగర్, బోయిగూడ, బన్సీలాల్ పేటలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామ రామ ఉయ్యాలో అంటూ పాట పాడారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తోంది. సద్దుల బతుకమ్మ రోజు ఊళ్లలో ఊరంతా కలిసి ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మలను చెరువు గట్టు తీసుకెళ్తారు. బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి.. మహిళలు ఒకరికొకరు ప్రసాదాలు పంచుకుంటారు. బొట్లు పెట్టుకుంటారు. కాగా పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ 19 నుంచి బతుకమ్మ సెలవులు ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications