మరో వివాదంలో మల్లారెడ్డి: యూనివర్సిటీలో భోజనంలో పురుగులు, విద్యార్థుల నిరసన
బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీ విద్యార్థులు మరోసారి నిరసనకు దిగారు. రాత్రి భోజనంలో పురుగులు ఉన్నాయంటూ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి భోజనంలో పురుగులు, ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయని విద్యార్థులు యూనివర్సిటీ ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలో విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. లక్షల్లో ఫీజులు తీసుకుని.. పురుగులు భోజనం పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలోనూ చాలాసార్లు భోజనం విషయంలో విద్యార్థులు ఆందోళనలు చేసిన పట్టించుకోలేదని తెలిపారు.

నాణ్యమైన ఆహారం అందించడం లేదని.. అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. యూనివర్సిటీకి పలమార్లు వచ్చిన మల్లారెడ్డి.. నాణ్యమైన భోజనం అందిస్తామని విద్యార్థులకు మాట ఇచ్చారని గుర్తుకు చేశారు. అయితే తరువాత కూడా యూనివర్సిటీ యాజమాన్యం భోజనం అలానే అందిస్తుందని మండిపడ్డారు.
నాణ్యమైన ఆహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకుని భోజనం మాత్రం పురుగులు, ప్లాస్టిక్ వస్తులు వస్తున్నా.. వర్సిటీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మల్లారెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించాలని కోరారు. న్యాయం జరిగేంతవరకు నిరసన విరమించమని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications