ఆ ఎమ్మెల్యేలను ఏం చేద్దాం.. సీఎంకు తలనొప్పిగా మారిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఒకవైపు కొందరు నేతలు అధికారంలోకి రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఎమ్మెల్యేలు - మునుగోడుకు చెందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరియు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి - సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక..
మంత్రి పదవి దక్కకపోవడంపై రాజ్‌గోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను పక్కన పెట్టడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంగా ఆయన పదేపదే సీఎంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు సమర్థులు ఉంటే మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రాజ్‌గోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేస్తున్నా, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దొంతి మాధవరెడ్డి చేతల యుద్ధం
మరోవైపు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాటలతో కాకుండా చేతలతోనే తన అసంతృప్తిని చూపిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డుకున్న ఆయన, ఇప్పుడు సీఎంను కలవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తే, దొంతి మాధవరెడ్డి ఆ సమావేశానికి దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. ఆయన తీరుతో నియోజకవర్గానికి కూడా అన్యాయం జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

మారిన సమీకరణాలు
గతంలో రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు ఇప్పుడు గప్చుప్ అయ్యారు. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌గోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డిల వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే రాజ్‌గోపాల్ రెడ్డి విషయంలో త్వరలోనే హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications