మా ఎమ్మెల్యేలు వెళ్లరు, చంద్రబాబు చిన్న పిల్లాడు కాదు: కేటీఆర్
హైదరాబాద్: తెరాస, టీడీపీ మధ్య ఓటుకు నోటు, ఆడియో టేప్ వివాదం దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు డబ్బులు ఇస్తూ తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి దొరికిపోయారనే ఆరోపణల పైన అరెస్టయ్యారు.
రేవంత్ రెడ్డిని, మరో ఇద్దరు నిందితులను ఏసీబీ నాలుగు రోజుల పాటు విచారించింది. ఈ విచారణలో పలు అంశాలు వారు ఆరా తీశారు. రేవంత్ రెడ్డి బాస్ గురించి ఆరా తీశారు. మరోవైపు, చంద్రబాబువిగా చెబుతున్న ఆడియో టేపులు కలకలం రేపాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు 'వన్ ఇండియా' ముఖాముఖిలో మాట్లాడారు.
చంద్రబాబు చట్టాని కన్నా పెద్దవారు కాదని, ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన పాత్ర తేలితే చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు.

చంద్రబాబు నాయుడు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
కేటీఆర్: చంద్రబాబు చట్టానికంటే మిన్న కాదు. చట్టం ప్రతి ఒక్కరి పట్ల సమానంగా వ్యవహరిస్తుంది. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా చట్టం ముందు సమానులే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన తప్పించుకోలేరు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఉందని తేలితే, చట్టం ప్రకారం ఆయనకు శిక్ష పడుతుంది. ఏసీబీ తన పని తాను చేస్తుంది.
మీ ప్రభుత్వం కుట్రతో ఇరికించిందని చంద్రబాబు చెబుతున్నారు కదా?
కేటీఆర్: చంద్రబాబు ఏమైనా చిన్నపిల్లాడా. విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రజలంతా విన్నారు. అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతను కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఆడియో టేప్ ఫోన్లో మాట్లాడింది నిజంగానే చంద్రబాబు గొంతు అని భావిస్తున్నారా?
కేటీఆర్: మొదట చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే డబ్బులు ఇస్తూ పట్టుబడ్డాడా లేదా చెప్పాలి. పట్టుబడ్డ ఎమ్మెల్యే పలుమార్లు బాస్ గురించి ప్రస్తావించారు. ఆ గొంతు తనదా కాదా అనే విషయాన్ని మొదట చంద్రబాబు చెప్పాలి. ఆయన ఖండించాలి లేదా తనదేనని చెప్పాలి.
చంద్రబాబు మీ ఎమ్మెల్యేలను ఎందుకు కొనాలనుకున్నారు?
కేటీఆర్: తెలంగాణ ప్రజలు టీడీపీని తిరస్కరించారు. చంద్రబాబు ఇంకా తెలంగాణలో ఉండాలనుకుంటున్నారు. అతను రాజకీయాలను నీచస్థాయికి తీసుకు వెళ్లారు. అందుకే రూ.5 కోట్లు పెట్టి కొనాలనుకున్నారు.
మీ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే కూడా ఆకర్షించబడలేదా?
మాకు నమ్మకం ఉంది. ఒకవేళ మా ఎమ్మెల్యేలు ఎవరైనా అలా ఆకర్షించబడినా.. తెలంగాణ ప్రజలు వారి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతారు.












Click it and Unblock the Notifications