'దృశ్యం' సినిమాలోలా: యువతి పరిస్థితి విషమం
హైదరాబాద్: శ్రీకాంత్ నటించిన దృశ్యం సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అందులో హీరో కూతురు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసి ఐజీ కుమారుడు ఆమెపై లైంగికవేధింపులకు పాల్పడుతాడు. ఆమె తల్లి అతన్ని చంపేస్తుంది. హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో నిజంగా అలానే జరిగింది. అయితే అక్కడ తల్లి చంపేస్తే ఇక్కడ తండ్రి తన కూతురిపై దాడి చేసిన యువకుడిని చంపేశాడు.
సినిమాలో మాదిరిగా లైంగిక వేధింపులకు పాల్పడకుండా ఈ యువకుడు ప్రేమించాలంటూ కాల్చుకు తిన్నాడు. ఆమె కాదన్నందుకు కొడవలితో దాడికి దిగాడు. చివరికి అదే కొడవలి వేటుకు యువతి తండ్రి చేతిలో హతమయ్యాడు.
శుక్రవారంనాడు యువతిపై ప్రేమోన్మాది రాజు కొడవలితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వివరణ ఈ సంఘటనకు సంబంధించింది. దాడిలో తీవ్ర గాయపడిన యువతిని ఆసుపత్రిలో చేర్చారు. యువతికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించామని, యువతిని మరో 48 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు. ఆత్మ రక్షణ కోసం ఉన్మాది రాజును చంపేసిన యువతి తండ్రికి బెయిల్ లభించింది.
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నిమ్మకాయల వల్లభరావు మూడేళ్ల క్రితం హైదరాబాదులోని కూకట్‌పల్లికి వలస వచ్చారు. ప్రశాంత్‌నగర్‌లో ఓ కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తూ, కంపెనీ యజమానికి చెందిన స్థలంలోనే కుటుంబంతో సహా నివసిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన మల్లేష్ అలియాస్ రాజు వల్లభరావు కుమార్తె పనిచేస్తున్న ప్రాంగణంలోనే మరో దుకాణంలో పని చేసేవాడు. అక్కడే వీరికి పరిచయమైంది. తర్వాత అమీర్‌పేటలోని ఓ సెల్‌ఫోన్ కంపెనీలో ప్రమోటర్‌గా చేరిన మల్లేష్ మూసాపేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తనను ప్రేమించాలంటూ మల్లేష్ ఏడాది కాలంగా ఆమె వెంట పడుతున్నాడు.
ఒకసారి ఆమె ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. వారు అందుకు తిరస్కరించారు. అయినా మల్లేష్ ఆమె వెంట పడడం మానలేదు. గురువారం ఆమె పుట్టినరోజు వేడుకకు వెళ్లిన మల్లేష్ తన ప్రేమ విషయాన్ని మరోసారి చెప్పాడు. తనకు పెళ్లి కుదిరిందని ఆమె అతడికి తెలిపింది. ఒక స్నేహితుడిగా మాత్రమే బర్త్‌డేకు పిలిచినట్టు స్పష్టం చేసింది. దీంతో మల్లేష్ ఆమెపై కోపంతో రగిలిపోయాడు.
శుక్రవారం తెల్లవారుజామునే ఆమె ఇంటికి చేరుకుని కొడవలితో దాడి చేశాడు. అడ్డుకున్న ఆమె తల్లి, సోదరుడిపైనా వేటు వేశాడు. అప్రమత్తమైన ఆమె తండ్రి వల్లభరావు అతడి చేతిలోంచి కొడవలి లాక్కుని మల్లేష్‌ను నరికేశాడు. చుట్టుపక్కల వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వల్లభరావును అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఆమెను, తులసమ్మ, గంగాధర్‌ను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications