కోటి ఇళ్లకు 15ఎంబీపీఎస్ నెట్, ‘టీ యాప్ ఫోలియో’తో అనేక సేవలు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలోని కోటి ఇళ్లకు ఈ ఏడాది చివరి నాటికి 15 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడితేనే దానికి విలువ ఉంటుందని, సమాచార శూన్యం నుంచి సమాచార విప్లవం దాకా ఎన్నో మార్పులొచ్చాయని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఎలక్ట్రానిక్ సేవల విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన టీయాప్ ఫోలియో మొబైల్ యాప్‌ను ఐటీసీ కాకకతీయ హోటల్‌లో ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

అనేక సేవలు ఒకే వేదికగా..
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల మొబైల్ అప్లికేషన్లన్నింటినీ ఒకే వేదికగా టీ యాప్ ఫోలియోలో పొందుపర్చడం వల్ల వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం 150 సేవలతో ప్రారంభమైన ఈ యాప్‌లో ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి సేవలు అందిస్తామన్నారు. మీసేవ ద్వారా పొందుతున్న సేవలన్నింటినీ ఇకపై ఈ యాప్ ద్వారానే పొందవచ్చన్నారు. ఈ ఏడాది చివరి నాటికి టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు 15 ఎంబీపీఎస్ వేగంతో అంతర్జాలాన్ని అందిస్తామన్నారు.

ఫీచర్ ఫోన్లకు కూడా
టీ ఫైబర్ ద్వారా ఇంటి నుంచే నేరుగా ప్రభుత్వాధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించుకునే రోజులు త్వరలో రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు. టీ యాప్ ఫోలియో వల్ల మీసేవ ఆపరేటర్లకు నష్టం వాటిల్లకుండా చూసేందుకు వారికి అదనంగా మరిన్ని సర్వీసులు అందిస్తామని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు లేకపోయినా ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా టీ యాప్ ఫోలియో సేవలు అందుతాయని మీసేవ రాష్ట్ర కమిషనర్ వెంకటేశ్వరరావు వివరించారు.

సేవలు వినియోగం ఇలా..
కాగా, టీ యాప్ ఫోలియో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లభిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన ఓఎస్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. దీని సైజ్ కూడా తక్కువే. ఇక ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసి అందులో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లేదా ఫేస్‌బుక్, జీమెయిల్‌లతో కూడా ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. దీంతో యూజర్ ఫోన్‌కు ఓ ఎంపిన్ ఓటీపీ రూపంలో వస్తుంది. దాన్ని యాప్‌లో ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం యాప్‌లో లభించే పలు సేవలను యూజర్లు పొందవచ్చు.

అనేక సేవలు
ప్రస్తుతం టీ యాప్ ఫోలియోలో ప్రజలకు పలు సేవలు లభిస్తున్నాయి. ఈ యాప్‌లో పౌరులు తమ పోస్ట్‌పెయిడ్, ల్యాండ్‌లైన్, ఇంటర్నెట్, డేటా కార్డ్ కనెక్షన్లకు బిల్లు చెల్లింపులు చేయవచ్చు. డీటీహెచ్, మొబైల్ రీచార్జిలు చేసుకోవచ్చు. అలాగే భూమికి సంబంధించిన పహానీ, ముటేషన్, పట్టాదార్ పాస్‌బుక్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్, బర్త్, డెత్ సర్టిఫికెట్లు, నివాస ధృవీకరణ పత్రం, ఓబీసీ, ఈబీసీ, ఫ్యామిలీ మెంబర్‌షిప్ ధృవీకరణ పత్రాలను పొందవచ్చు. టీ యాప్ ఫోలియోలో పౌరులు జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను చెల్లింపు చేయవచ్చు.

అవసరమైన సమాచారం
భద్రాచలం, యాదగిరి గుట్ట, వేములవాడ తదితర దేవస్థానాల్లో సేవా టిక్కెట్లు, రూమ్‌లను బుక్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, టెస్ట్ స్లాట్ బుకింగ్, టెస్ట్ ఫీజు చెల్లింపు, లైసెన్స్ రెన్యువల్, బ్యాడ్జ్, లెర్నర్స్ లైసెన్స్ వంటి ఆర్‌టీఏ సేవలను పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, టూరిజం సమాచారం, హైదరాబాద్ మెట్రో సమాచారం, మెట్రో మార్గాలు, చార్జిల వివరాలు, సమీపంలో ఉండే మీ సేవ కేంద్రాలు, వైఫై హాట్ స్పాట్స్, రేషన్ షాపులు, వ్యవసాయ సమాచారాన్ని ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఆర్‌టీసీ బస్ రూట్లు తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications