రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ దావత్: రేవంత్ సర్కారుకు కేటీఆర్ సవాల్
తన బావమరిది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ దావత్‌ను రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలతో తమ గొంతును నొక్కలేరన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
మూసీ స్కాం, వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలు, రేవంత్ బావమరిదికి ఇచ్చిన కాంట్రాక్టు వ్యవహారంతో పాటు అనేక స్కాంలను బీఆర్ఎస్ బయటపెడుతోందన్నారు. తమ ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పలేక కుట్రలకు తెరలేపారని రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి చర్య లతో తమ ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయలేక.. తమ కుటుంబసభ్యులు, బంధువులపై కేసులు బనాయిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు కేటీఆర్. ఉద్యమంలో అడుగుపెట్టిన రోజే చావుకు తెగించి వచ్చామన్నారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. దాదాపు 22 గంటలుగా తమ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారన్నారు. వీరి సోదాలు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
తన బావమరిది రాజ్ పాకాల ఉంటున్న సొంత ఇంట్లో దీపావళి పండగ సందర్భంగా దావత్ చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు కేటీఆర్. గృహ ప్రవేశం సందర్భంగా బంధువులను పిలిచి దావత్ ఇచ్చారు. కొందరు రేవ్ పార్టీ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మీడియా కథనాలు వస్తున్నాయన్నారు. అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు.
70 ఏళ్ల వృద్ధుల నుంచి చిన్న పిల్లలు సహా కుటుంబం మొత్తం బంధుమిత్రులతో కలిసి ఉంటే దాన్ని రేవ్ పార్టీ అని ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ బంధువులు ఫ్యామిలీ పార్టీలో అసలు డ్రగ్స్ దొరకలేదన్నారు. ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడని.. అతడు డ్రగ్స్ ఎక్కడ్నుంచి తీసుకున్నాడు? దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఫ్యామిలీ పార్టీలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని తేలిందని, పార్టీలో ఎక్కడా డ్రగ్స్ లభించలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఈ మేరకు చెప్పారన్నారు. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే.. పురుషులు, మహిళలు అంటూ అనుమానం కలిగేలా తమ బంధువులను మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. వారు పురుషులు మహిళలు కాదని దంపతులని అన్నారు. చేతనమైతే రాజకీయంగా తలపడాలని సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని కేటీఆర్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications