ఇవాంకా టూర్: హైదరాబాద్‌లో రెండ్రోజులు, అధికారిక షెడ్యూల్ ఇదే..
ఈ నెల 28 నుంచి 30 వరకు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు హైదరాబాద్ వేదిక అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు అయిన ఇవాంకా
హైదరాబాద్: ఇవాంకా ట్రంప్ భాగ్యనగర పర్యటకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఆమె పర్యటన గురించి నగర వాసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తం రెండు రోజులపాటు ఆమె హైదరాబాద్ లో గడపనున్నారు.
Recommended Video

ఈ నెల 28 నుంచి 30 వరకు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు హైదరాబాద్ వేదిక అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి...
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైటెక్ సిటీ ప్రాంతంలో ఆమె బస చేయనున్న వెస్టిన్ హోటల్ కు చేరుకుంటారు.

3 గంటలకు హెచ్ఐసీసీకి...
మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇవాంకా వెస్టిన్ హోటల్ లోనే విశ్రాంతి తీసుకుని 3 గంటలకు హెచ్ఐసీసీలో జరిగే సదస్సుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4:25 నిమిషాల వరకు ఆమె సదస్సులో పాల్గొంటారు.

సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ...
మంగళవారం సాయంత్రం 4:25 నిమిషాలకు ఇవాంకా ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. 5:50 నిమిషాలకు ఆమె తిరిగి తాను బస చేస్తోన్న వెస్టిన్ హోటల్ కు చేరుకుంటారు. అదేరోజు రాత్రి 8 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొంటారు. అనంతరం రాత్రి 10:40 నిమిషాలకు తిరిగి తన హోటల్ కు చేరుకుంటారు.

సాయంత్రం తిరిగి అమెరికాకు...
29వ తేదీ బుధవారం ఉదయం పది గంటలకు ఇవాంకా మళ్లీ హెచ్ఐసీసీకి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు వెస్టిన్ హోటల్ కు చేరుకుని, సాయంత్రం ఐదు వరకు హోటల్ లో ఉంటారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం చేరకుని అమెరికాకు బయలుదేరతారు.

ఇవాంకా చుట్టూ ఐదంచెల భద్రతా వ్యవస్థ...
ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి 60 మంది భద్రతా సిబ్బంది ఆమెతో పాటు రానున్నారు. తొలి అంచెలో వారే ఉంటారు. తరువాతి అంచెలో ఇంటెలిజెన్స్ అధికారులు, ఆ తరువాతి అంచెలో కూడా అమెరికా భద్రతాధికారులు ఉంటారు. చివరి రెండు అంచెల్లో ఎన్ఐఏ, హైదరాబాద్ భద్రతాధికారులు ఉంటారు.












Click it and Unblock the Notifications