టీ - కాంగ్రెస్ లో సిన్హా పంచాయితీ - జగ్గారెడ్డి లేఖ కలకలం : రేవంత్ నిర్ణయం తో..!!
తెలంగాణ రాజకీయం హీటెక్కుతోంది. అటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు - ఇటు రాష్ట్రపతి అభ్యర్ధి సిన్హాకు ఘన స్వాగతంతో టీఆర్ఎస్ కౌంటర్ పాలిటిక్స్ చేస్తున్న వేళ..టీపీసీసీ లో కొత్త వివాదం మొదలైంది. ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఫ్లెక్సీలు - ట్వీట్లు.. మీడియా సమావేశాలతో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకుంటున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం విషయంలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయించారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
ఇక, రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిన్హాతో టీఆర్ఎస్ సమావేశం కానుంది. ఆ తరువాత ఎంఐఎంతోనూ సిన్హా సమావేశం కానున్నారు. అయితే, జాతీయ స్థాయిలో సిన్హాకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ .. తెలంగాణలో మాత్రం ఆయన్ను కలవటానికి ససేమిరా అంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ తో కలిసిన తరువాత తమను కలుస్తున్నారని.. తాము అందుకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.

ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసామంటూ రేవంత్ వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయం పైన పార్టీ నేత జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ ఎపిసోడ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తప్పు బడుతూ ఆయన లేఖ రాసారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సిన్హాకు మద్దతు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.
సిన్హా హైదరాబాద్ వచ్చిన సమయంలో సీఎల్పీకి ఆహ్వానిస్తే బాగుండేదని పేర్కొన్నారు. సిన్హాకు జాతీయ స్థాయిలో మద్దతు ఇస్తూ.. హైదరాబాద్ వచ్చిన వేళ ఇక్కడ మద్దతుగా నిలవకపోవటం పైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యక్తిగతంగా కలిసేందుకు సిన్హాను అప్పాయింట్ మెంట్ కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం టీ కాంగ్రెస్ లో కొత్త చర్చకు కారణమవుతోంది. ఈ సాయంత్రం వరకు సిన్హా హైదరాబాద్ లోనే ఉండనున్నారు.












Click it and Unblock the Notifications