శభాష్ వికాస్: అంధ విద్యార్థి ప్రతిభ చూస్తే ఫిదా అవుతారు..
సర్వేద్రియానాం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లో కెల్లా ప్రధానమైనవి కళ్లు అంటారు. అయితే మూడేళ్ల వయసులోనే అనారోగ్యంతో కంటి చూపును కోల్పోయాడు ఆ బాలుడు. కుమారుడి చూపు కోసం శక్తికి మించి తల్లిదండ్రులు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. అయితే ఆ బాలుడు మాత్రం ఎలాంటి నిరాశ, నిస్పృహ లేకుండా వైకల్యాన్ని జయించి అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. కంటి చూపు లేకున్నా.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. అనుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నాడు. పాటలు, పౌరాణిక గాథల్లోని పద్యాలను అలవోకగా చెప్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. కలెక్టర్ కావడమే తన లక్ష్యంగా సాగుతున్నాడు ఈ అంధ విద్యార్థి.
మూడేళ్లకే కంటి చూపును కోల్పోయాడు ఆ బాలుడు. తండ్రికి రెండు కిడ్నీలు పాడైపోయాయి. తల్లికి కూడా అనారోగ్యం. అంతేకాక ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆ బాలుడి లక్ష్యాన్ని మాత్రం నియంత్రించలేదు. లక్ష్య సాధనకు శారీరక లోపం ఏ మాత్రం అడ్డం కాదని నిరూపిస్తూ తన ప్రతిభతో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు బాలుడు వికాస్ నాయక్.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని లోంకా తాండాకు చెందిన వికాస్ నాయక్ నిజామాబాద్ పట్టణంలోని స్నేహ సొసైటీకి చెందిన అంధుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అతను మూడేళ్ల వయసులోనే అనారోగ్యంతో చూపును కోల్పోయాడు. కళ్లు లేకపోయినా అచంచలమైన ప్రతిభ వికాస్ నాయక్ సొంతం. ఆ బాలుడు అద్భుతంగా పాటలు పాడతాడు. కొమరెల్లి మల్లన్న, బీరప్ప, రాముడు, సీత , హనుమంతుని లాంటి పౌరాణిక గాథలను కథలు, పాటల రూపంలో ధారాళంగా చెప్పడంలో వికాస్ నాయక్ ప్రావీణ్యం సంపాదించాడు. అలాగే టీవీలో వచ్చే కార్టూన్ క్యారెక్టర్ ల డైలాగ్స్ ను అచ్చు గుద్దినట్లు అనుకరించి చెప్పగలడు.
అయితే ఈ అంధ విద్యార్థి ప్రతిభకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముగ్ధులయ్యారు. బాలుడిపై ప్రశంసలు కురిపించారు. ఈ విద్యార్థి అద్భుతమైన గొంతుతో పాటలు పాడుతుంటే విని మురిసిపోయారు. ఆ విద్యార్థి కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చూసి జగ్గారెడ్డి చలించిపోయారు. రూ. 7.50 లక్షల సాయం అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు.
తన కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని మిమ్మల్ని కలవడానికి వచ్చామని వికాస్ నాయక్ జగ్గారెడ్డితో తన బాధను చెప్పుకున్నాడు. తన తండ్రి రెండు కిడ్నీలు పాడై తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని చెప్పాడు. తన కోసం, తన తండ్రి వైద్య చికిత్స కోసం రూ. 7 లక్షల అప్పు అయిందని వికాస్ నాయక్ కన్నీరు పెట్టుకున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని జగ్గారెడ్డిని కోరాడు. తాను స్వయంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టుకుంటానని, సహకరించాలని కోరాడు. కష్టపడి బాగా చదువుకుని కలెక్టర్ ను అవుతానని జగ్గారెడ్డికి తెలిపాడు వికాస్ నాయక్.

వికాస్ నాయక్ కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన జగ్గారెడ్డి వెంటనే వికాస్ నాయక్ కు ఆర్థిక సాయం చేశారు. రూ. 7. 50 లక్షల సాయం అందించారు. అంతేకాక కొత్త స్మార్ట్ ఫోన్ తెప్పించి ఇచ్చాడు. అలాగే యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటుకు సహకరిస్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. ఇకపై తమ ఇంట్లో జరిగే ప్రతీ కార్యక్రమంలోనూ పాటలు పాడేందుకు పిలిపిస్తానని వికాస్ నాయక్ కు జగ్గారెడ్డి చెప్పారు. అలాగే స్వయంగా కారు ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి పంపించారు.












Click it and Unblock the Notifications