చీటింగ్ కేసు ఎఫెక్ట్: మోసకారి మాటలు నమ్మొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరిక
తక్కువ ధరకు ఐఫోన్ 7 అమ్ముతానంటూ పాడైన సెల్‌ఫోన్‌ను ఓ యువతికి అంటగట్టిన కళ్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేశారు. అతను తనకు తాను జనసేన అధికార ప్రతినిధిగా చెప్పుకున్నాడు.
హైదరాబాద్: తక్కువ ధరకు ఐఫోన్ 7 అమ్ముతానంటూ పాడైన సెల్‌ఫోన్‌ను ఓ యువతికి అంటగట్టిన కళ్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేశారు. అతను తనకు తాను జనసేన అధికార ప్రతినిధిగా చెప్పుకున్నాడు.

పవన్ కళ్యాణ్ పేరిట ప్రకటన
దీనిపై జనసేన ఆదివారం స్పందించింది. కొందరు వ్యక్తులు జనసేన అధికార ప్రతినిధులమని ప్రచారం చేసుకుంటున్నారని, వారి మాటలను నమ్మవద్దని పవన్ కళ్యాణ్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.

అలా ఫిర్యాదులు అందాయి
ఆ ప్రకటనలో ఏముందంటే.. జనసేన పార్టీ అధికార ప్రతినిధులమంటూ కొందరు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ మధ్య కాలంలో తన దృష్టికి వచ్చిందని, ఒకేసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను, మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియా వారితో కూడా ఆ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

విరాళాలు కూడా.. వాస్తవాలు చెప్పేందుకే
కృష్ణా జిల్లాలో అయితే తాను పార్టీ అధికార ప్రతినిధిని, విరాళాలు ఇవ్వాలని కూడా ఓ వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసిందని, అందువల్ల జనసేన శ్రేణులు, మీడియా వారికి వాస్తవాలు తెలియజేసేందుకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాంటి వారి పేర్లు చెప్పండి
జనసేన తరఫున చర్చల్లో పాల్గొనేందుకు ఎవరినీ నియమించలేదని, ఆ వ్యక్తులు చెప్పే మాటలు, వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని, పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాంటి మోసకారి మాటలు నమ్మొద్దు
అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరఫున ప్రతినిధులుగా నియమిస్తామని, ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియచేస్తామని, ఈ లోగా పార్టీ ప్రతినిధులమని ఎవరైనా ప్రచారం చేసుకున్నా, విరాళాలు అడిగినా అలాంటి మోసకారి మాటలను నమ్మవద్దని చెబుతున్నానని, ఇటువంటి వారిపై జనసేన శ్రేణులు అప్రమత్తమంగా ఉండాలని ఆ ప్రకటనలో కోరారు.












Click it and Unblock the Notifications