ప్రధాని సాహసం, ఇది చెంపపెట్టు కానీ: జేపీ ప్రశంసలు, నాడు జేపీకి మోడీ కితాబు
నల్ల ధనం నిర్మూలనకు ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ బుధవారం నాడు ప్రశంసించారు.
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ బుధవారం నాడు స్పందించారు. ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని నోట్ల రద్దు అంశంపై మాట్లాడారు. నల్ల ధనం నిర్మూలనకు ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
మోడీ నిర్ణయం పన్నులు ఎగ్గొచ్చేవారికి, అవినీతికి పాల్పడే వారికి చెంపపెట్టులాంటిదన్నారు. కానీ మళ్లీ నల్లధనం సృష్టించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డబ్బులు ఉన్నవారంతా అవినీతిపరులు కాదని వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఖర్చుల కోసం నగదు మార్పిడి చేసుకుంటున్న సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇచ్చే వారికి ఏడేళ్ల జైలుశిక్ష వేయిస్తున్న ప్రభుత్వం, లంచం తీసుకుంటున్న అధికారులపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. లంచాలు తీసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న ఉద్యోగుల ఆస్తులను జప్తు చేయాలన్నారు.
నల్ల ధనం పైన ప్రధాని మోడీ నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి నిర్మూలనకు ఓ చట్టం తీసుకు రావాలన్నారు. ఆయన హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్లో ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ జేపీ పైన ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. నాడు జేపీ - మోడీలు విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఆ కలయిక సార్వత్రిక ఎన్నికలకు సమయంలో జరిగింది. అప్పుడు జేపీ మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు.
టిడిపి - బిజెపి మిత్రపక్షాలు. టిడిపికి మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. మల్లారెడ్డి టిడిపి నుంచి పోటీ చేశారు. జేపీ కలిసినప్పుడు మోడీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మీలాంటి వారు పార్లమెంటుకు రావాలని కితాబిచ్చారు. అయితే, మల్కాజిగిరిలో తన పైన గెలిచే ఉద్దేశ్యంలో భాగంగానే జేపీ.. మోడీని కలిశారని నాటి టిడిపి అభ్యర్థి, నేటి ఎంపీ మల్లారెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications