మేం సరే, కెసిఆర్ రాజీనామా చేస్తారా?: హరీష్‌కు జీవన్ రెడ్డి ప్రతి సవాల్
వరంగల్: లోకసభ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదవికి రాజీనామా చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మంత్రి హరీష్ రావుకు ప్రతి సవాల్ చేశారు.
వరంగల్ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఓడిపోతే టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. దీనికి జీవన్ రెడ్డి ప్రతి సవాల్ చేశారు.
ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఫాంహౌస్‌ను వదిలి, రైతు సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయం సాధించడం ఖాయమన్నారు. కాగా, టిఆర్ఎస్ ఓటమి మాట పక్కన పెట్టి.. గతంలో కంటే మెజార్టీ తగ్గినా కెసిఆర్ పరువు పోయినట్లేనని అందరూ భావిస్తున్నారు.

కాగా, గురువారం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశారు. రాజధానిలో ప్రెస్ మీట్లు పెట్టడం కాదని, గ్రామాల్లోకి వచ్చి చూడాలన్నారు.
48 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ... ఎంగిలి మెతుకుల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టిందన్నారు. హాస్టల్ పిల్లలకు గ్రాముల లెక్కన అన్నం పెట్టిన కక్కుర్తి కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తెలంగాణ వెనుకబాటుకు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. తాము ప్రతి వాగ్ధానం అమలు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications