పెళ్లి పేరు చెప్పి బైక్‌పై తీసుకెళ్లి అడవిలో అమ్మాయి గొంతు కోశాడు
వరంగల్: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని యువకుడు అడవికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెంలో చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన సునారికాని రాజబాబు(22) అదే గ్రామానికి చెందిన జనగాం లక్ష్మి(19)ని శనివారం రాత్రి వివాహం చేసుకుంటానని చెప్పి మోటారు సైకిల్‌పై తీసుకెళ్లాడు.
ఆదివారం తెల్లవారు జామున ఏటూరు అటవీ ప్రాంతంలో హతమార్చేందుకు బ్లేడుతో ఆమె గొంతుకోశాడు. గొంతు నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో లక్ష్మి స్పృహ కోల్పోయింది. దీంతో లక్ష్మి చనిపోయి ఉంటుందని భావించిన రాజబాబు ఆమె కాళ్లపట్టీ గొలుసులు, చెవి కమ్మలు కూడా తీసుకుని తన గ్రామానికి చేరుకున్నాడు.
అయితే ఆదివారం తెల్లవారు జామున స్పృహలోకి వచ్చిన లక్ష్మి ఘటనా స్థలం నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఏటూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు పడుతూ లేస్తూ చేరుకుంది. తీవ్రగాయాలతో ఆమెను గమనించిన గ్రామస్తులు ఎవరని ఆరా తీయగా తనది బుట్టాయిగూడెమని లక్ష్మి తెలిపింది. వెంటనే ఏటూరు గ్రామస్తులు బుట్టాయిగూడెంకు సమాచారం చేరవేయగా తల్లి మల్లక్కతో పాటు మరి కొంతమంది అక్కడికి చేరుకున్నారు.

తన బిడ్డ రక్తస్రావంతో చావు బతుకుల మధ్య ఉన్న విషయాన్ని గుర్తించిన మల్లక్క, బంధువులతో కలిసి 108లో మండలకేంద్రంలోని సామాజిక వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఎస్సై వినయ్‌కుమార్ వైద్యశాలకు చేరుకుని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేయగా నోటమాట వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాగితంపై సునారికాని రాజబాబు పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోశాడని రాసింది లక్ష్మి.
తన కుమార్తెను గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకుంటానని రాజబాబు వెంట పడుతున్నాడని లక్ష్మి తల్లి మల్లక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వెంటనే ఎంజీఎం దవాఖానకు తరలించారు.
లక్ష్మి, రాజబాబు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తున్నారు. లక్ష్మికి తాడ్వాయి మండలం కాటాపూర్ సమీపంలోని ఓ గ్రామం నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఇది ఖరారు కూడా అయింది. తెల్లవారితే పెళ్లి అనగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని లక్ష్మి చెప్పినట్లు తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి తెంపుకున్నారు.
అదే గ్రామానికి చెందిన మరో యువతిని రాజబాబు పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ విషయాన్ని లక్ష్మి నిరాకరించడంతో ఈ ఇద్దరి మధ్య కొంత విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన వివాహానికి అడ్డుపడుతున్నట్లు భావించిన రాజబాబు శనివారం రాత్రి లక్ష్మిని వివాహం చేసుకుంటానని నమ్మించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. అయితే ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ తెల్లవారే సరికి లక్ష్మిపై హత్యాయత్నం జరిగినట్లు మాత్రం వెలుగు చూసింది. అయితే రాజబాబు ప్రస్తుతం పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications