రీఎంట్రీ గట్టిగా ఉండబోతోంది
హైదరాబాద్ లో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంటోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో- అన్ని రాజకీయ పార్టీలూ దీనిపై దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోన్నాయి. ఈ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్, ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భారత్ రాష్ట్ర సమితి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ సైతం అభ్యర్థిని నిలబెట్టబోతోంది. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది.
అటు టీడీపీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఎన్నికల బరిలో దిగబోతోంది. ఈ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పునఃప్రవేశం చేయాలని పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తోన్నారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణకు చెందిన టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన భేటీ ఇది. అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్, నన్నూరి నర్సిరెడ్డి, వెంకటేశ్వర్లు, నందమూరి సుహాసిని తదితర నాయకులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని నియమించడం మొదలుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి వరకు అనేక అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్ర, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరుం గురించి కూడా పార్టీ నాయకులు చంద్రబాబుకు గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని మండలాలకు అధ్యక్షులను నియమించామని, 1.78 లక్షల సభ్యత్వ నమోదు చేశామని వివరించారు. గ్రామ స్థాయి క్యాడర్ బలంగా ఉందని, సరైన నాయకత్వం లభిస్తే పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. నందమూరి సుహాసినికి టికెట్ ఇవ్వాలని మెజారిటీ నాయకులు సూచించారు. గతంలో ఆమె కూకట్ పల్లిలో పోటీ చేసిన విషయం తెలిసిందే. సుహాసిని అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు సూచనప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించవచ్చు. పోటీ చేయడానికి ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications