'జంగిల్ సఫారీ' కి వెళ్దామా.. ? హైదరాబాద్ కు దగ్గరలోనే..!
హైదరాబాద్ ప్రజలు.. ఎప్పుడూ చారిత్రక కట్టడాలు, జలపాతాలు చూసి బోర్ కొట్టిందా..? సిటీలో అన్నీ కవర్ చేశారా..? అయితే ఎంచక్కా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న అమ్రాబాద్ నల్లమల అడవులకు వెళ్లండి.. ఇక్కడ పెద్దపులులతోపాటు అనేక జంతువులు, పక్షులను చూసి ఆస్వాదించవచ్చు. అంతేకాక ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు అబ్బో ఒక్కటేమిటి ఇలా చాలానే ఉన్నాయి. పిల్లలు, పెద్దలు సరదాగా ప్రకృతి అందాలను తనివితీరా ఎంజాయ్ చేయవచ్చు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోని నల్లమల అడవుల్లో ఉంది. ఇది దక్షిణ భారత్ లోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ లలో ఒకటి. ఈ అడవిలో పెద్ద పులులు, చిరుతలు, అడవి పందులు, నీల్గాయిలు మనకు దర్శనమిస్తాయి. అంతేకాక వందల రకాల పక్షులు కూడా ఉంటాయి. ఇక టూరిస్టుల కోసం ట్రెక్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో 26 ఉన్న పెద్ద పులుల సంఖ్య 36 కు చేరింది. దీంతో పర్యటకుల సంఖ్య పెరిగింది. అడవిలో టైగర్ ట్రాకింగ్, నేచర్ ట్రయల్ వాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక నవంబర్ నుంచి మే వరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సందర్శనకు అనువైన సమయంగా చెబుతారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు దగ్గరలోనే శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఈ టైగర్ రిజర్వ్ లో పెద్ద పులులు, చిరుతలు, సాంబర్ జింకలు, అడవి పందులు.. అలాగే రకరకాల పక్షులు మనకు దర్శనమిస్తాయి. పర్యటకులు శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడంతోపాటుగా జీప్ సఫారీ, కృష్ణా నది వ్యూ పాయింట్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ టూరిస్టులకు ఎనలేని అనుభూతిని అందిస్తాయి.

ఈ టూర్ కు వెళ్లాలని ఆసక్తి కలిగిన వాళ్లు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ అయిన www.amrabaadtigerreserve.com లో ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవచ్చు. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ లభ్యం అవుతాయి. ప్యాకేజీలో భాగంగా జంగిల్ సఫారీ, రాత్రి కాటేజీలో స్టే, ఉదయం ట్రెక్కింగ్.. తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక హైదరాబాద్ నుండి అమ్రాబాద్ అడవులు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు 2 నుంచి 3 గంటలు పడుతుంది.












Click it and Unblock the Notifications