నోటీసులిచ్చాక చంద్రబాబు భవిష్యత్తేమిటో తెలుస్తుంది: కడియం
హైదరాబాద్: సెక్షన్ 8 అమలుపై, హైదరాబాదును యుటిగా చేయాలనే డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులకు చేస్తున్న వాదనలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఘాటు సమాధానం ఇచ్చారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యుటి)గా చేయాలనే హక్కు ఆంధ్రవాళ్లకు లేదని ఆయన శనివారంనాడు అన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చాక ఆయన భవిష్యత్ ఏమిటో తెలుస్తుందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. నోటుకు ఓటు కేసు నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు అండ్ కో సెక్షన్-8 పేరు ఎత్తుతున్నారని విమర్శించారు. సెక్షన్-8లో అవినీతికి, దొంగతనానికి సంబంధించిన విషయాలేమీ లేదన్నారు. ఇది చంద్రబాబుకు సంబంధించిన విషయమని, రెండు రాష్ట్రాల మధ్య సమస్య కాదు కడియం స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిధి దాటి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అవినీతి, దొంగతనం కేసులు సెక్షన్ 8 కిందికి రావని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే వారు ఆ నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌పై సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టపగలు దొరికిన దొంగ అని ఆయన వ్యాఖ్యానించారు దొరికిన దొంగలకు నీతులు చెప్పే హక్కు లేదని ఆయన సెక్షన్ 8పై ఆంధ్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానంగా అన్నారు. చంద్రబాబు, ఆయన మంత్రుల్లాంటి వారు దొరకడం ఎపి ప్రజలు చేసుకున్న కర్మ అని కడియం శ్రీహరి అన్నారు.
సెట్ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారంనాడు విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా 6,432 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణలో 3,540 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 2,892 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వీసీల నియామకాలు చేపడతామని ప్రకటించారు.












Click it and Unblock the Notifications