మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్‌లో ఎలాంటి లోపం లేదు, ప్రజల రక్షణ కోసమే నో ఎంట్రీ: ఈఎన్సీ
భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడపై నిపుణుల బృందం పరిశీలిస్తోందని ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో ఈ అంశంపై మాట్లాడారు.
మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్‌లో ఎలాంటి లోపం లేదని, ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నిర్మించిందని చెప్పారు. బ్యారేజీ కుంగుబాటు తర్వాత నీటిని దిగువకు విడుదల చేశామని, త్వరలోనే మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని, ఎవరినీ బ్యారేజీ పరిసరాల్లోకి అనుమతిండం లేదని చెప్పారు.

గతంలో 29 లక్షల క్యూసుక్కులు వచ్చినా బ్యారేజీ చెక్కు చెదరలేదని ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు వివరించారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ముప్పులేదని.. బ్యారేజీ బి బ్లాక్‌లో 20వ పిల్లర్ కుంగిపోయిందని ఆయన చెప్పారు. నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. ఘటనపై మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు.
కాగా, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై ప్రతిపక్షాల నేతలు తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అవినీతి వల్లే ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే కుంగిబాటుకు గురైందని మండిపడుతున్నారు. మరోవైపు, ఆదివారం మంథని ఎమ్మెల్యే, సీనీయర్ కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ కార్యకర్తలకి.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, ఆ తర్వాత బ్యారేజీని సందర్శించేందుకు అనుమతి ఇచ్చారు పోలీసులు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు. దీంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు శ్రీధర్‌బాబుతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను నిలిపివేశారు. దీంతో బ్యారేజీ వద్ద కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపటి వరకు ఆందోళనలు కొనసాగాయి. అనంతరం ఎమ్మెల్యేను సందర్శనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications