కేసీఆర్ రూటు మారింది: మాయావతి పార్టీతో పొత్తు
KCR: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని, మరిన్ని అధిక లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయ భారాన్ని లోక్‌సభ బరిలో విజయంగా మలచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.
ఈ క్రమంలో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీఆర్ఎస్. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేసీఆర్, బీఎస్పీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంయుక్తంగా ప్రకటించారు. బీఆర్ఎస్-బీఎస్పీ మధ్చ పొత్తు కుదిరినట్లు వెల్లడించారు.

ఈ మేరకు వారిద్దరూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని కేసీఆర్ అన్నారు. సిద్ధాంతపరంగా తమ రెండు పార్టీల మధ్య భావసారూప్యం ఉందని వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాల మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకట్రెండు రోజుల్లో దీన్ని ఖరారు చేస్తామని కేసీఆర్ అన్నారు. బీఎస్పీకి గౌరవ ప్రదమైన సీట్లను కేటాయిస్తామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్‌తో పాటు జనరల్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయొచ్చు కదా? అంటూ నవ్వుతూ చెప్పారు. పొత్తుపై మాయావతితో ఇంకా మాట్లాడ లేదని, రేపో మాపో సంప్రదింపులు పూర్తవుతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications