మా నాన్న కూడా తిట్టలేదు, విహెచ్‌ను పోలీసులు తిట్టకుండా చూస్తా: కెసిఆర్
హైదరాబాద్: అత్యాధునిక పోలీస్ కమిషనరేట్ శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావుల మధ్య ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.
విహెచ్ మాట్లాడుతూ... పోలీసులు బయటికి బాగానే మాట్లాడుతున్నారని, పోలీస్ స్టేషన్లలోకి వెళ్తే మాత్రం ఏం భాష మహాప్రభో.. మా ఇంట్లో నాన్న కూడా అట్ల తిట్టలేదు, ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియాలి.. అందరూ భజన చేస్తే ఎలా అని వ్యాఖ్యానించారు.
విహెచ్ వ్యాఖ్యల పైన కెసిఆర్ కౌంటర్ ఇచ్చారు. ఒకప్పటితో పోల్చితే పోలీసులు ఉపయోగించే భాషలో చాలా వరకు మార్పొచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వీహెచ్ విసుర్లపై కెసిఆర్ పైవిధంగా స్పందించారు.

పుష్కరాల సందర్భంగా కోట్ల మందికి రద్దీ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు సంయమనంతో మాట్లాడారని వందల మంది భక్తులు తనకు చెప్పారని కెసిఆర్ అన్నారు. సంస్కరణలు ఒక్క రోజులోనే రావని, కొంత సమయం తప్పదన్నారు.
కెసిఆర్ ఇంకా మాట్లాడుతూ... వీహెచ్‌ను పోలీసులు తిట్టకుండా చూసే బాధ్యత తనదేనని చమత్కరించారు. కాగా, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు కేటాయించాలని కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు నగర వ్యాపారులు స్పందించి సామాజిక బాధ్యతగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.వందకోట్లు వెచ్చిస్తే బాగుంటుందన్నారు.












Click it and Unblock the Notifications