మరీ ఇంత అసహనమా?: ప్రతిపక్షాలు, ఆంధ్రజ్యోతిని ఏకేసిన కెసిఆర్, చివరలో తీపి కబురు

హైదరాబాద్: అసత్య ఆరోపణలు చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేస్తున్న తమ ప్రభుత్వంపై ఇంత అసహనం వ్యక్తం చేయడం మంచిది కాదని ప్రతిపక్షాలకు సూచించారు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిన్ ఛానల్ ప్రభుత్వంపై అసమ్మతి ఉందని సృష్టిస్తుండగా, గుడ్డిగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదురోజులకే తన దిష్టిబొమ్మ దహనం చేసి ప్రతిపక్షాలు తమ సంస్కారాన్ని తెలియజేశాయని అన్నారు. తొందరపాటు, ఓర్వలేని తనం మంచి కాదని అసెంబ్లీలోనే చెప్పానని గుర్తు చేశారు. వరంగల్ ఫలితాలతోనైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పోషించాలని, అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు.

రైతుల రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది మేమే, తప్పకుండా చేసి తీరుతామని అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు, నీచాతినీచమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం పని చేస్తుంటే కొందరు ముఖ్యమంత్రిని చెట్టుకు కట్టేసి కొట్టాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు.

ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, వారి సంక్షేమం కోసమే నిరంతరం శ్రమిస్తున్నామని సిఎం కెసిఆర్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో వివాదం వద్దనుకున్నామని, పొరుగు అంటే ఏపినే కాదు, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా ఉంటాయన్నారు. కొత్త రాష్ట్రానికి పునాదిరాయి వేసేందుకు ప్రజలు తమకు అవకాశం ఇచ్చారని అన్నారు.

ప్రజలకందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమైనా పొరపాటు లేకుండా చూస్తామని అన్నారు. తలకాయ తెగినా సరే పొరపాటు చేయమని అన్నారు. గతంలో ఏపిని పాలించిన సిఎంలు నీళ్లిచ్చే పథకాలు చేపట్టలేదని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాకపోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. శ్రీరాంసాగర్ ఫేజ్2 కాలువ తవ్వితే ఇంకా నీళ్లు రాలేదని అన్నారు.

కల్వకుర్తి, బీమా లాంటి పథకాలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ఏపి పాలకులు వివక్ష చూపి నీటి ప్రాజెక్టులను పూర్తికాకుండానే వదిలేశారని అన్నారు. తెలంగాణకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వివాదంగా మార్చారని అన్నారు. దీనికి అన్ని ఆధారాలున్నాయని చెప్పారు. మా మునిమనవళ్లు కూడా దీంతో నీళ్లు చూడరని తాను అప్పుడు చెప్పినట్లు కెసిఆర్ తెలిపారు.

KCR fires at opposition leaders

పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచే నీళ్లు వస్తాయని చెప్పారు. ఆంధ్రజ్యోతి అనే పత్రిక అసత్య వార్తలు రాస్తూనే వుందని మండిపడ్డారు. ఆ పత్రికలో వచ్చిన అసత్యాలను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు పిచ్చి కూతలు కూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాభారతి కడ్తామంటే ధర్నాలు చేస్తారని, టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి భవనాలు రావొద్దనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

మంచి సెక్రటేరియట్ నిర్మిద్దామన్నా, ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మించాలని తలపెట్టినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిప్డారు. సాగునీరందించే మిషన్ కాకతీయను కమిషన్ కాకతీయ అంటూ విమర్శలు చేస్తున్నారని అన్నారు. హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వంలో ప్రతి పండగను గౌరవిస్తామని, బతుకమ్మ కోసం నిధులు కేటాయిస్తే.. కెసిఆర్ బిడ్డ కోసమే అంటారు.. కెసిఆర్ కూతురేనా? తెలంగాణ ఆడ బిడ్డలు ఆడరా అని అన్నారు. ‘హెలికాప్టర్ లో సర్వే చేస్తే.. కిందికి దిగమంటూ వ్యాఖ్యలు చేస్తారు. వరంగల్ వెళ్లి పాదయాత్ర చేస్తే నువ్వేమైనా కార్పొరేటర్ వా అంటరు. అమ్మ పెట్టదు. అడుక్కోనివ్వదు' అన్నట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పాం. చేస్తాం. ఇప్పటికే 8వేల కోట్ల రుణాలు మాఫీ చేసినం. ఏపి లెక్క చేయం. తెలంగాణలో ఇంకా 17వేల కోట్ల రుణ మాఫీ చేయాలి. చేస్తాం' అని కెసిఆర్ చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా పోయిందని అన్నారు.

తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత విత్తనాల, ఎరువులు సకాలంలో సరఫరా చేశామని అన్నారు.
ఎరువులు, విద్యుత్ కోసం ఎక్కడా ఆందోళనలు జరగలేదని అన్నారు. ప్రతి మండలంలో గోదాంలు కట్టిస్తున్నామని చెప్పారు.

ఇండియాలో నెం. 1 వెల్ఫేర్ స్టేట్ తెలంగాణ అని సిఎం కెసిఆర్ చెప్పారు. 33వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు గుడ్డిగా, వ్యతిరేకత, వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నాయని, మానుకోవాలని సూచించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా వ్యవహరించాలన్నారు.

తీపి కబురు

2021మార్చి కల్లా కోటి ఎకరాల్లో నీరు వచ్చి తీరాలని, అందుకోసమే పని చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మహిళా సంఘాలకు, కంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు, శుభవార్త అందుతుందని చెప్పారు. వారం రోజుల్లోగా ఉద్యోగుల విభజన జరుగుతుందని అన్నారు. 15 నుంచి 20వేల పోస్టుల కోసం త్వరలోనే డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను ఏడాదికి ఏడాదికి పెంచుకుంటూ పోతామని అన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలోని 2లక్షల మంది క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తామని, భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కళ్యాణలక్ష్మి పథకాన్ని బిసి వర్గాలతో సహా వెనకబడిన వారందరికి, అగ్రవర్ణాల పేదలకు కూడా వర్తించేలా చూస్తామని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతీ మంత్రి దగ్గర రూ. 25కోట్లు డిపాజిట్ ఉంచుతామని చెప్పారు.

జిహెచ్ఎంసి ఎన్నికలు, నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక, బడ్జెట్ సమావేశాల తర్వాత జిల్లాలో బస్సు యాత్రలు నిర్వహిస్తానని కెసిఆర్ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని అన్నారు. మార్చి నాటికి పగటిపూట రైతులకు 9గంటల విద్యుత్ అందిస్తామని చెప్పారు. 2018 వరకు 24గంటల విద్యుత్ అందిస్తామన్నారు.

పత్తి ధర కేంద్రం పరిధిలోనిది కాబట్టి, పార్లమెంటులో ఎంపీలు పోరాటం చేస్తారని అన్నారు. కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లల్లోని విద్యార్థులకు కూడా సన్న బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను, కమిటీలను త్వరలోనే నియమిస్తామని అన్నారు. పార్టీ నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు.

ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని, లేదంటే ప్రజలకు దూరమవుతాయని అన్నారు. తాను యాగం చేస్తానంటే సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం బాధ కలిగించిందని అన్నారు. డిసెంబర్ 24-27 వరకు చేసే ఆయుత చండీయాగానికి రాష్ట్రపతి, గవర్నర్, కేంద్రమంత్రులు, ఏపి సిఎం చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

కానిస్టేబుళ్లు, హోంగార్డులు, విరమణ పొందిన ఉద్యోగులకు డబుల్ బెడ్ రూం ఇళ్లలో వాటా ఇస్తామని, వీరితోపాటు రూ.6లక్షల ఆదాయానికి తక్కువగా ఉన్నవారికి కూడా వాటా కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం కేంద్రమంత్రి వెంకయ్యతో మాట్లాడినట్లు తెలిపారు. జర్నలిస్టులకు కూడా వాటా కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+