ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై కేసీఆర్ కీలక నిర్ణయం..!?
ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ తెలంగాణ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ - ఇండియా కూటమి నుంచి ఇద్దరు అభ్యర్ధులు ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఇండి కూటమి అభ్యర్ధిగా తెలంగాణ కు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగు వ్యక్తి పోటీలో ఉండటంతో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అయితే,అన్ని పార్టీల స్టాండ్ పైన క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ మద్దతు ఎవరికనేది సస్పెన్స్ గా మారుతోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా తమిళనాడుకు చెందిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాక్రిష్ణన్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి అనూహ్యంగా తెలంగాణకు చెందిన సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించారు. దీంతో, తెలుగు వ్యక్తం పోటీ చేస్తుండటం తో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు మద్దతు ఇవ్వాలని రేవంత్ కోరారు. ఏపీలో టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. దీంతో.. ఆ రెండు పార్టీలు ఆ కూటమి అభ్యర్ధికే మద్దతు ఇవ్వటం ఖాయం అయింది. అదే సమయంలో వైసీపీ మద్దతు బీజేపీ కోరటం.. మాజీ సీఎం జగన్ అందుకు సానుకూలంగా స్పందించటంతో ఏపీ పార్టీల వైఖరి పైన స్పష్టత వచ్చింది.

ఇక, తెలంగాణలో కాంగ్రెస్- బీజేపీ ఓటింగ్ పైన క్లారిటీ ఉంది. మరి.. బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ కు లోక్ సభ లో ప్రాతినిధ్యం లేదు. రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. తమ మద్దతు కోసం ఏ కూటమి సంప్రదించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేసారు. తాము రెండు కూటములకు జవాబు దారీ కాదని పేర్కొన్నారు. రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు. కాగా, కేసీఆర్ ఈ ఎన్నిక పైన పార్టీ ముఖ్యులతో ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కేంద్రంలోని రెండు కూటముల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా భవిష్యత్ లో సమస్యలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. వినాయక చవితి తరువాత పార్టీ ముఖ్యుల సమావేశంలో కేసీఆర్ అధికారికంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications