బాబుతో మాట్లాడా, త్వరలో శుభావార్త: కెసిఆర్, ఆంధ్రావాళ్లకే: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలో విలీనమైన ఏడు మండలాలలోని ఐదారు గ్రామాలు త్వరలో తెలంగాణకు రానున్నాయని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారు. భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందన్నారు.
సమస్య పరిష్కారం కోసం తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని చెప్పారు. దీనికి సంబంధిచి త్వరలో శుభావార్త వింటారని కెసిఆర్ గురువారం నాడు శాసన సభలో చెప్పారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు కూడా అంగీకరించవచ్చునని కెసిఆర్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. కాగా, సభలో అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టు విషయమై చంద్రబాబును మెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్రా కాంట్రాక్టులకు పనులు: రేవంత్
నదీ జలాల వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల పైన సభలో సీఎం కెసిఆర్ అబద్ధాలను అందంగా చెప్పి, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారని తెలంగాణ టడిడిపి నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారని అందుకే తాము పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను బహిష్కరించామన్నారు.

జల విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు.ప్రభుత్వం జల విధానంపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, సభాపతికి వేరే చోట ఈ కార్యక్రమం పెట్టమని మూడు రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినా ఇంత వరకు స్పందించలేదన్నారు.
గత అరవై ఏళ్లుగా ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించలేదన్నారు. అసెంబ్లీని ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చిందన్నారు. ప్రతిపక్షాలను చులకన చేసే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారని, ఆయన చక్రవర్తిలా... ఆయన కుటుంబ సభ్యులు సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications