ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడు..
రేపే వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా వినాయకుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. ఇక, తెలుగురాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు అనగానే అందరికీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడే టక్కున గుర్తుకొస్తాడు. ఎందుకంటే, ఇక్కడ కొలువయ్యే వినాయకునికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఖైరతాబాద్ వినాయకున్ని చూసేందుకు చాలామంది భక్తులు బారులు తీరుతారు. ఈ గణనాథుడికి ఒక్క తెలుగురాష్ట్ర్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది.
ఇక, ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగుల ఎత్తులో ఉండనున్నాడు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి కావొస్తుండడంతో ఈ సారి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇక, ఈఏడాది వినాయకుడు సప్తముఖ మహాగణపతిగా పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. ఖైరతాబాద్ సప్తముఖ గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. సప్తముఖ మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని జరిపించింది. ఈకార్యక్రమంలో స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భారీ బందోబస్తు..
ఇక, ఈసారి ఖైరతాబాద్ వినాయకున్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వినాయకచవితి రావడంతో రెండురోజులు సెలవు వచ్చింది. దీంతో భక్తులు గణనాథుని దర్శనానికి బారులు తీరే ఛాన్స్ ఉందని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వినాయకచవితి ఉత్సవాల్లో మొదటిరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా పూజలు చేయనున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో 24 గంటల పాటు మొత్తం మూడు షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలతోపాటు 22 ప్లాటూన్ల సిబ్బంది కూడా ఉంటారని సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ వివరించారు. ఈ క్రమంలో ఇక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు.
ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడు..!!#KhairatabadGanesh #KhairatabadGanesh2024 #GaneshChathurti2024 pic.twitter.com/cZKE6dY1CW
— oneindiatelugu (@oneindiatelugu) September 6, 2024












Click it and Unblock the Notifications