ప్రేమ: పేరంట్స్ మందలింపుతో ఇంటిపై కూలర్‌లో దాక్కున్న విద్యార్ధిని, హైరానా
హైదరాబాద్: ప్రేమ విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్ధిని ఆడిన నాటకం తల్లిదండ్రులు, పోలీసులను ఐదు గంటల పాటు హైరానా పడేలా చేసిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఖమ్మం పట్టణంలోని సారథినగర్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని అదే ప్రాంతంలోని ఓ యువకుడితో ప్రేమలో పడింది.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విద్యార్థిని సోమవారం రాత్రి మందలించారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు లేచి చూసేసరికి విద్యార్ధిని కనిపించలేదు. దీంతో ఇంటి చుట్టుపక్కల వెతికారు. స్నేహితుల ఇళ్లకి వెళ్లిందేమోనని ఆరాతీశారు. బంధువుల ఇళ్లలోను వెతికారు.
విద్యార్ధిని మొబైల్‌కి ఫోన్ చేస్తే, రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అనుమానం వచ్చి విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యువకుడి ఇంటికి వెళ్లి ఆరాతీయగా అతను కూడా ఊర్లో లేడని సమాధానం వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ కలసి వెళ్లిపోయారన్న ఆందోళనతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. పోలీసు విచారణలో విద్యార్ధిని ప్రియుడు తాను సారపాకలో ఉన్నానని, తనకు ఆమె విషయం తెలియదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు కూడా ఆమె కోసం తీవ్రంగా వెతికారు. సుమారు 5 గంటల పాటు ఈ తతంగం నడిచింది.

విద్యార్థిని సెల్‌ఫోన్ ట్రాకింగ్ పెట్టగా సిగ్నళ్లు సారథినగర్ ప్రాంతం నుంచే వస్తున్నాయని గమనించారు. విద్యార్థిని సైతం తన సెల్‌ఫోన్ ఆఫ్ చేయకపోవడంతో రింగ్ అవుతోంది. దీంతో మళ్లీ వెతుకులాట ప్రారంభించారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో విద్యార్థిని ప్రియుడికి ఫోన్ చేసిన పోలీసులు గట్టిగా మందలించడంతో తాను ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నది కనుక్కుని చెబుతానని చెప్పాడు.
ప్రియుడు ఫోన్ చేయడంతో విద్యార్ధిని లిఫ్ట్ చేసి మాట్లాడింది. తాను ఇంట్లోనే ఉన్నానని సమాధానం చెప్పడంతో ఇదే విషయాన్ని కొద్ది సేపటి తర్వాత ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇంట్లో కనిపించకపోవడం వల్లనే వెతుకుతున్నామని ఎక్కడుందో చెప్పమని హెచ్చరించారు.
దీంతో మళ్లీ ఆ యువకుడు మరోసారి విద్యార్థినికి ఫోన్ చేసి వివరాలు సేకరించి పోలీసులకు తిరిగి ఫోన్ చేసి విద్యార్థిని మేడపై ఉన్న కూలర్‌లో ఉందని చెప్పాడు. అనంతరం పోలీసులు, కుటుంబ సభ్యులు మేడపై ఉన్న కూలర్‌లో కూర్చున్న యువతిని బయటకు తీసి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇలా ఐదు గంటలపాటు సాగిన హైడ్రామాకు తెరపడింది. తర్వాత ఆమెకు, ఇలాంటి పనులు చేయకూడదని, ఏ విషయం గురించి అయినా తల్లిదండ్రులతో సూటిగా మాట్లాడుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications